గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తమ ఆయుధంగా చేసుకున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం కేంద్రానిదే అని ఎవరూ ఘాటుగా విమర్శించడం లేదు..కాని బీజేపీనీ టీడీపీ విమర్శించడం లేదని అధికార పార్టీ నేతలు, కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలదీయడం లేదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు తప్పా, నేరుగా కేంద్రం జోలికి వెళ్లడం లేదు.అయితే మంత్రి అవంతి మాత్రం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా కేంద్రాన్ని ఒప్పించిన తర్వాతే బీజేపీ, పవన్ కళ్యాణ్ లు ఓట్లు అడగడానికి రావాలని డిమాండ్ చేశారు.
కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టకపోగా. విశాఖ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తాం అని కేంద్రం మాట్లాడటం కరెక్టు కాదన్నారు. విశాఖ ఉక్కుపై కేంద్రాన్ని అడిగే దమ్మూ, ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. మోదీ పేరు చెబితేనే చంద్రబాబు, లోకేష్ గజగజ వణుకుతున్నారన్నారు. కేంద్రంలో ఉన్నది బీజేపీనా.. వైసీపీ ప్రభుత్వమో కూడా లోకేష్ కు తెలియదని ఎద్దేవా చేశారు. కంటెంట్ ఉన్నవాళ్లకు కటౌట్ ఎందుకు అంటూ.. జగన్ బొమ్మే తమ అభ్యర్థులను మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపిస్తుంది అన్నారు. మొన్న పంచాయతీల్లో గెలిచి నిరూపించామని మున్సిపాల్టీలో కూడా అదే నిజం కాబోతుందన్నారు.
చంద్రబాబుకు విశాఖ ఓట్లు, సీట్లు కావాలి గానీ… ఇక్కడి ప్రజల పట్ల ఆయనకు ప్రేమ, అభిమానం అవసరం లేదంటూ విమర్శించారు. రాజధానిని అడ్డుకుంటున్నందుకు ముందుగా విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పిన తరువాతే.. చంద్రబాబు, లోకేష్ ఓట్లు అడగడానికి రావాలని నిలదీశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా అయితే ఆపలేరో.. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని కాకుండా చంద్రబాబు అడ్డుకోలేరన్నారు.