జగనన్న భజన ఎక్కువైంది.. మంత్రులకు నిజంగానే సీఎంపై ప్రేమ ఉందా?

Jagan-Mohan-Reddy

ఏపీలో రాజకీయాలు జోరందుకున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా ప్రస్తుతం కాపు సామాజికవర్గం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పొచ్చు. అందుకు కారణం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈసారి కాపు సామాజికవర్గం మద్దతు కోరుతుండటమేనని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈసారి ఆయన మరింత రాజకీయ పరిణతి ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తుండటంతో కాపు సామాజికవర్గం కూడా ఆయన పట్ల సానుకూలంగా ముందుకు వెళ్తోంది.

అయితే జనసేన ఒంటరిగా పోటీ చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. అందుకే జనసేన టిడిపితో కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సరిగ్గా ఇదే వైసీపీకి గుబులు పుట్టిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టిడిపి, జనసేనలతో రాష్ట్రంలో అన్ని పార్టీలు కట్టకట్టుకొని పోటీ చేసినా తమకు తిరుగులేదని వైసీపీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు.

వైసీపీలో కూడా కాపు ఓటర్ల గురించి గుబులు మొదలైంది. తాజాగా వైసీపీలోని కాపు మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి వాటి పొత్తుల గురించి, కాపు ఓటు బ్యాంక్ గురించి పదేపదే మాట్లాడుతూ భుజాలు తడుముకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఏపీలో ప్రధానంగా ఉన్న మూడు పార్టీల్లో కాపుల గురించే చర్చ నడుస్తోంది. మాజీ మంత్రి పేర్నినాని కూడా ఈ మధ్యన మంచి సమర్దుడైన కాపు నాయకుడు ముఖ్యమంత్రి అయితే మంచిదే అని అనడంతో రాజకీయంగా ఆ మాట చర్చనీయాంశమైంది.

అయితే కాపు సామాజికవర్గానికే చెందిన మంత్రి కొట్టు సత్యనారాయణ మాత్రం నిర్మొహమాటంగా తమకు కాపు ముఖ్యమంత్రి అవసరం లేదని జగనన్న తమకు చాలని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే కాపు సామాజికవర్గం టిడిపి, జనసేనలవైపు మొగ్గితే, జగనన్న భజన చేసినా ఎవరూ గెలిచే అవకాశం ఉండదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. కనుక వైసీపీలో కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులందరూ కూడా ఓ పక్క సిఎం జగన్‌, కాపు భజన చేస్తూ మరోపక్క చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లని విమర్శిస్తూ సందడి చేస్తున్నారు.