మిథున్ రెడ్డి అరెస్ట్‌పై జగన్ రియాక్షన్ ఇదే.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు..!

ఏపీ రాజకీయాల్లో మద్యం కుంభకోణం కేసు ఇప్పుడు రసకసందంగా మారింది. లిక్కర్ స్కాం కేసులో A4గా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. రాజంపేట నుంచి మూడు సార్లు వరుసగా ఎంపీగా గెలిచిన మిథున్‌రెడ్డిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చూపుతూ వేల కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి జరిగిందని సిట్ అధికారులు చెబుతున్నారు. దీనిపై ఆపార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు.

సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన జగన్… ఇది కచ్చితంగా అధికార కూటమి పార్టీ కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడే వారికి నోరు మూయించడానికి రాజకీయ కుట్రలు, అక్రమ అరెస్టులు చేస్తే న్యాయం నిలబడదన్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ పూర్తిగా తప్పుడు కేసు. మా ఎంపీని బలవంతపు ఒప్పుకోలు ద్వారా ఇరికిస్తున్నారు అని జగన్ ట్వీట్ చేశారు. ఇది కేవలం రాజకీయ ప్రతీకార ధోరణి మాత్రమేనని, టీడీపీ ప్రభుత్వం తాము చేస్తున్న మోసాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తమ నేతలపై తప్పుడు కేసులు మోపుతోందని ఆరోపించారు. మిథున్ రెడ్డికి నేను పూర్తి మద్దతుగా ఉన్నాను అని ట్వీట్‌లో ప్రకటించారు జగన్.

లిక్కర్ స్కాం కేసు విచారణ మెల్లగా కాస్త వేగం పుంజుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులు సిట్ ఎదుట హాజరై ప్రశ్నింగు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఎంపీ స్థాయిలో అరెస్ట్ జరిగిందంటే ఇదే ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. మిథున్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా… అధికారపక్షం మాత్రం కేసు నిజమని, న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గమని స్పష్టంచేస్తోంది.