ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు చట్టాలపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు లో విచారణ ముగిసింది. ఇదివరకే హైకోర్టు ఈ అంశాలపై స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అవి ఈరోజుతో ముగియడంతో దానిపై విచారించిన కోర్టు స్టేటస్ కో అమలు గడువును వచ్చే నెల అంటే సెప్టెంబర్ 21 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వచ్చే నెల 21 నుంచి రోజూ జరిపే విచారణపై హైకోర్టు ధర్మాసనం సంబంధిత న్యాయవాదులతో చర్చించింది. సోషల్ డిస్టెన్స్ పాటిస్టూ తగు జాగ్రత్తలు తీసుకుంటే హైకోర్టులో విచారణ జరిపేందుకు తాము సిద్ధమని ధర్మాసనం వెల్లడించింది.
ఇక.. స్టేటస్ కో అమలును పొడిగించడంతో రాజధానికి సంబంధించిన బిల్లును అమలు చేయడం కుదరదు. దీంతో తదుపరి విచారణ సెప్టెంబర్ 21న జరగనుంది.
ఇక.. హైకోర్టు లో రాజధానుల అంశం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ నితీశ్ గుప్తా… ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేశారు. స్టేటస్ కో అమలులో ఉన్న సమయంలో విశాఖలోని కాపులుప్పాడలో ఏపీ ప్రభుత్వం అతిథి గృహాన్ని నిర్మంచడానిక సన్నాహాలు చేసిందని.. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అలా చేయడం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దానికి శంకుస్థాపన కూడా చేశారని.. ఇది కోర్టు తీర్పుకు విరుద్ధమని స్పష్టం చేశారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం.. సెప్టెంబర్ 10 లోపు కోర్టు దిక్కరణ పిటిషన్ పై కౌంటరు దాఖలు చేయాలంటూ రాష్ట్ర సీఎస్ ను హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు చట్టాలపై రైతులు, ఇతర ప్రజా సంఘాలు కలిపి మొత్తం 70 పిటిషన్లను దాఖలు చేశారు. వాటన్నింటినీ త్రిసభ్య ధర్మాసనం విచారించింది.