కరోనా టైమ్ లో ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సమాయత్తం చేస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. డీఎస్సీ 2020 పై ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన తెలిపారు. అయితే.. డీఎస్సీ కంటే ముందు టెట్ పరీక్షను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
నిజానికి 2018 లో నిర్వహించిన డీఎస్సీకి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. 2018 డీఎస్సీకి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించాక.. ఆ పోస్టులన్నింటినీ భర్తీ చేసి.. 2018 డీఎస్సీ నియామకాలు పూర్తి కాగానే.. వెంటనే డీఎస్సీ 2020 నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
గతంలో కాకుండా… టెట్ విధివిధానాలు, సిలబస్ అన్నీ నూతన విద్యావిధానానికి అనుగుణంగా రూపొందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
2018 డీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీ షెడ్యూల్ ఇదే
అయితే.. కోర్టులో కేసుల కారణంగా నిలిచిపోయిన 2018 డీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీ షెడ్యూల్ ను మంత్రి ప్రకటించారు. మరో 1321 మంది డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని మంత్రి వెల్లడించారు. డీఎస్సీలో అర్హత సాధించిన వాళ్లకు సమాచారం అందిస్తున్నామని… త్వరలోనే వాళ్ల డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈనెల 24న అర్హత సాధించిన వాళ్లు.. ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరు కావాలని స్పష్టం చేశారు.
ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 25, 26న కౌన్సెలింగ్ ఇచ్చి.. అదే రోజున అపాయింట్ మెంట్ ఆర్డర్ కూడా ఇస్తారని.. వాళ్లకు కేటాయించిన స్కూళ్లలో ఈనెల 28న చేరాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.