ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు. ఓవైపు ఎన్నికలు నిర్వహించాలంటూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి తొందరపడుతుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం తొందరెందుకు అంటోంది? దీంతో ఈసీ, ప్రభుత్వం… రెండింటి మధ్య రోజురోజుకూ అంతరం పెరుగుతోంది. మాటల యుద్ధాలు కూడా జరుగుతున్నాయి.
ఇప్పటికే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ సీఈసీ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు.. స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించాల్సిందేనని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్నారు. కరోనా పరిస్థితులను అంచనా వేసి.. వైద్య అధికారులతో చర్చించిన తర్వాత వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తాజాగా వెల్లడించారు.
అలాగే.. కరోనా వ్యాప్తి కూడా రాష్ట్రంలో తీవ్రంగా తగ్గిందని.. అయినప్పటికీ కరోనా జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తామని.. త్వరలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.
అయితే.. రాత్రికి రాత్రే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. నిమ్మగడ్డ ప్రకటన చేశారో లేదో… వెంటనే ఏపీ సీఎస్ నీలం సాహ్ని.. నిమ్మగడ్డకు లేఖ రాశారు.
రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు ఉన్నాయని.. యాక్టివ్ కేసుల దృష్ట్యా ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు.. అంటూ ఆ లేఖలో నీలం సాహ్ని పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం మిగితా రాష్ట్రాల్లో అక్కడ పరిస్థితులను బట్టి చర్యలు తీసుకున్నారు. కానీ.. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం కరెక్ట్ కాదు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విజృంబిస్తుంది. కరోనా వ్యాప్తి పెరుగుతుంది. అది చాలా ప్రమాదం. ఆరోగ్య శాఖ, పరిపాలన శాఖ ఇప్పటికే కరోనా కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికలు అంటే కరోనాను మరింత వ్యాప్తి చెందేలా చేయడమేనని సాహ్ని ఆ లేఖలో స్పష్టం చేశారని తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎన్నికలకు సంసిద్ధం కావాలని.. రాష్ట్ర ప్రజల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని… ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని నీలం సాహ్ని వెల్లడించారు.
అయితే.. నీలం సాహ్ని రాసిన లేఖపై నిమ్మగడ్డ కాస్త ఘాటుగానే స్పందించినట్టు తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ స్వయం ప్రతిపత్తిని సీఎస్ లేఖ ప్రశ్నిస్తోందని… ఇది రాజ్యాంగ వ్యవస్థను కించపరచడమేనని.. దీనిపై మరోసారి హైకోర్టుకు వెళ్లేందుకు నిమ్మగడ్డ సంసిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.