ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. అసలే ఓవైపు ఎన్నికల కమిషన్ తో ఏపీ ప్రభుత్వం నువ్వా నేనా? అన్నట్టుగా ఉంది. మరోవైపు న్యాయవ్యవస్థపై కూడా సీఎం జగన్ పోరాడుతున్నారు. ఈనేపథ్యంలో ఏపీ గవర్నర్ కూడా జగన్ కు షాకిచ్చారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో తమకు నచ్చిన వారిని వైస్ చాన్సలర్లుగా నియమించుకునే హక్కుకు సంబంధించిన బిల్లుపై గవర్నర్ సంతకం పెట్టలేదు.
ఏపీ సర్కారు తయారు చేసిన ఆ బిల్లుపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆ బిల్లు మళ్లీ వెనక్కి వెళ్లింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఆ బిల్లు ఉందని ఆయన స్పష్టం చేశారు. వైస్ చాన్సలర్ల నియామకంలో రాజకీయ పాత్ర ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
నిజానికి యూజీసీ నిబంధనల ప్రకారం కూడా యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల నియామకంలో ప్రభుత్వం పాత్ర ఉండదు. ఉండకూడదు కూడా. అయితే.. ప్రభుత్వం ఇచ్చిన సిఫార్సు ఆధారంగా… వైస్ చాన్సలర్లను నియమించాలంటూ యూనివర్సిటీల చట్టానికి సవరణ చేసి.. గవర్నర్ ఆమోదం కోసం పంపింది.
కానీ.. గవర్నర్ మాత్రం ఆ ఫైల్ ను పెండింగ్ లో పెట్టారు. చివరకు సీఎం జగన్ డైరెక్ట్ గా గవర్నర్ దగ్గరికి వెళ్లి బిల్లుపై సంతకం పెట్టాలని కోరారు. కానీ.. తర్వాత గవర్నర్ ఆ బిల్లును వెనక్కి పంపించారు. ఇది ప్రభుత్వానికి పెద్ద షాకే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.