ఆంధ్రప్రదేశ్‌లో మందు ప్రియులకు త్వరలోనే శుభవార్త అందనుంది. రాష్ట్ర ఖజానాకు మరోసారి భారీగా ఆదాయం వచ్చేలా ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ (liquor) షాపుల పక్కనే ఉండే పర్మిట్ రూమ్‌లు మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లిక్కర్ లైసెన్సుల దరఖాస్తుల ద్వారా రూ.1900 కోట్లకు పైగా ఆదాయం వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు కొత్త ఎక్సైజ్ పాలసీతో 2024-25లో సుమారుగా రూ.28,000 కోట్ల ఆదాయం రాబట్టాలని అంచనా వేస్తోంది.
దీనితోపాటు, పర్మిట్ రూమ్‌లకు మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరో రూపంలో సంపాదనను పెంచాలని చూస్తోంది. గతంలో ఏడాదికి రూ.5 లక్షల ఫీజు ఉంటే, ఈసారి కార్పొరేషన్ పరిధిలోని షాపులకు రూ.7.5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాటికి పాత రేటే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఫీజుల్లో ఈ మార్పుతోనే ప్రభుత్వానికి సుమారుగా రూ.200 కోట్ల అదనపు ఆదాయం వస్తుందన్నది అధికారుల అంచనా వేస్తున్నారు.
ఇక పర్మిట్ రూమ్ అంటే liquor షాపు పక్కన ఏర్పాటు చేసే చిన్న గది. అక్కడ కూర్చుని కాకుండా నిల్చునే స్థలంలోనే తాగే అవకాశం కల్పిస్తారు. పర్మిట్ రూమ్‌ల వల్ల బహిరంగంగా మద్యం తాగి.. స్థానికులకు ఇబ్బంది కలిగించే అవకాశం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే వీటిని మినీ బార్లుగా మార్చుకుని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే సెప్టెంబర్ నుంచి ఈ కొత్త సౌకర్యం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.