అందరిలో పాతుకుపోయిన ఒక సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం. అలా చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ముఖ్యంగా దేవుడికి సంబంధించిన విషయాల్లో ఉన్న సెంటిమెంట్లను టచ్ చేయడానికి కూడా ఎవ్వరూ సాహసించరు. కానీ.. మొండితనంలో కూడిన ధైర్యంతో సీఎం జగన్ ఉన్నారు కాబట్టి.. ఖచ్చితంగా ఆయన ఓ సెంటిమెంట్ కు చరమగీతం పాడబోతున్నారు. అది కూడా మంచికోసమే. ఎప్పటి నుంచో ఉన్న ఓ నెగెటివ్ సెంటిమెంట్ అది. దాన్ని బ్రేక్ చేసి అందరి నోళ్లు మూయించబోతున్నారు సీఎం జగన్.
ఒక్క ఏపీలోనే కాదు.. యావత్ దేశం మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలుసు. అందుకే తిరుమలలో ఏం జరిగినా.. ఏపీ ప్రభుత్వం కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ రోజు.. శ్రీవారికి ఏపీ ముఖ్యమంత్రి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అది ఆచారం.. ఎప్పటి నుంచో వస్తున్నదే. కానీ.. 2003లో ఓ సంఘటన జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు… గరుడసేవ రోజున తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా.. తిరుమల కొండ ఎక్కుతుండగా.. అలిపిరి వద్ద చంద్రబాబుపై నక్సల్స్ దాడి చేశారు. నక్సల్స్ దాడిలో చంద్రబాబు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తిరుమల శ్రీవారి కరుణతో చంద్రబాబు బతికి బయటపడ్డారు.
కానీ.. అప్పటి నుంచి ఒక నెగెటివ్ సెంటిమెంట్ ప్రజల్లో నాటుకుపోయింది. అందుకే… గరుడసేవ రోజున కాకుండా.. బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యే రోజు ధ్వజారోహణం నాడు ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. దాడి జరిగిన తర్వాత ఏడాది కూడా చంద్రబాబు గరుడసేవ రోజున కాకుండా…. ధ్వజారోహణం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పిస్తూ వస్తున్నారు.
చంద్రబాబే కాదు.. ఆ తర్వాత ఏపీకి ముఖ్యమంత్రులుగా అయిన వాళ్లంతా గరుడసేవ రోజు తిరుమల కొండను ఎక్కలేదు. అందరూ ధ్వజారోహణం రోజునే స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
అంతెందుకు… ప్రస్తుత సీఎం జగన్ కూడా గత సంవత్సరం ధ్వజారోహణం రోజునే తిరుమల వెళ్లారు. పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈసంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి… తిరుమల ఆనవాయితీ ప్రకారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాలంటూ ఏపీ సీఎం జగన్ కు కబురు అందింది. అయితే.. ధ్వజారోహణం రోజున కంటే.. గరుడసేవ రోజులన స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తే మంచిదని.. ఈసారి కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం లేనందున… ధ్వజారోహనం రోజున కాకుండా.. గరుడసేవ రోజున ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని.. తిరుమల ఆనవాయితీని తిరుమల అర్చక స్వాములు సీఎం జగన్ కు తెలిపారట.
దీంతో సీఎం జగన్ కూడా వెంటనే ఓకే చెప్పేశారట. తిరుమల ఆనవాయితీని తాను కూడా గౌరవిస్తానని… నెగెటివ్ సెంటిమెంట్ కు తాను భయపడనని సీఎం స్పష్టం చేశారట. అందుకే.. సీఎం జగన్ ఈసారి ధ్వజారోహనం రోజున కాకుండా… గరుడసేవరోజున తిరుమల స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించబోతున్నారు. దీనివల్ల రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న నెగెటివ్ సెంటిమెంట్ కు జగన్ చెక్ పెట్టడమే కాకుండా.. హిందూ దేవాలయాల విషయంతో సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తున్న హిందుత్వ వాదులు ఇక నోరు తెరిచే అవకాశమే ఉండదు.. అని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.