ఏపీ సీఎం వైఎస్ జగన్ త్వరలో ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఇదే ఏపీలో హాట్ టాపిక్. అరె.. మొన్ననే కదా జగన్ ఢిల్లీకి వెళ్లింది. అప్పుడు కేంద్ర మంత్రులను కలిశారు కదా. ప్రధాని మోదీతోనూ భేటీ అయ్యారు. మళ్లీ ఇంత సడెన్ గా ఢిల్లీ టూర్ ఏంటి అని అనుకుంటున్నారా? అవును.. సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఢిల్లీ వెళ్తున్నారంటే ఉండే కారణాలు అవే. రాష్ట్రానికి వచ్చే నిధులను విడుదల చేయండి. రాష్ట్రాన్ని ఆదుకోండి. హామీలను నెరవేర్చండి.. ఇవే కదా.. కేంద్రాన్ని కోరేది. ఇటీవల వెళ్లినప్పుడే సీఎం జగన్.. కేంద్రాన్ని కోరారు కదా.. మళ్లీ ఢిల్లీ టూర్ ఎందుకు. దాని కోసం ఒక లేఖ రాసినా సరిపోతుంది కదా.. అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ.. ఈసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వెనుక రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే కాదట. అంతకు మించి ఉందంటూ ప్రచారం సాగుతోంది.
అంతకు మించి అంటే ఏముంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ ఏంటి? రైతుల ధర్నా. ఢిల్లీ చుట్టూ రైతులు గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ వాళ్లు ధర్నా చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతులతో చాలాసార్లు చర్చించినప్పటికీ.. చర్చలు సఫలం కాలేదు. దీంతో వాళ్ల నిరసనను ఉధృతం చేశారు. ఇటీవల రైతులంతా కలిసి భారత్ బంద్ కూడా నిర్వహించారు. భారత్ బంద్ కు రెండు తెలుగు రాష్ట్రాలు మద్దతు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు రెండు తెలుగు రాష్ట్రాలు వ్యతిరేకంగా భారత్ బంద్ లో పాల్గొన్నాయి.
అయితే.. వ్యవసాయ చట్టాలను తెచ్చినప్పుడు… పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. కానీ.. భారత్ బంద్ లో మాత్రం పాల్గొన్నారు. వైసీపీ రైతులకు మద్దతు తెలిపింది. దీంతో కేంద్రం కూడా కాస్త కన్ఫ్యూజన్ లో పడిపోయింది. అప్పుడు పార్లమెంట్ లో కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చిన చాలా పార్టీలు ఇప్పుడు రైతులకు మద్దతు తెలుపుతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి బుజ్జగించే ప్రయత్నాన్ని ప్రారంభించింది కేంద్రం.
దానిలో భాగంగానే… తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా బుజ్జగిస్తోందట. అందుకే.. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో పాటు పలు కేంద్ర మంత్రులను కూడా కలిసి వచ్చారు. తాజాగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లేది కూడా అందుకేనట. వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇవ్వాలని.. కేంద్రంతో కలిసి పోరాడాలని చెబుతున్నారట. అంటే.. రైతుల ఉద్యమాన్ని కేంద్రం ఇలా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందన్నమాట.