ఢిల్లీకి అంబటి.! నిజమేనా.? ‘బ్రో’పై ఫిర్యాదు కోసమేనా.?

ఢిల్లీకి ఓ ముఖ్యమైన పని మీద వెళుతున్నట్లు మంత్రి అంబటి రాంబాబు మీడియాకి సమాచారమిచ్చారు. వాస్తవానికి, ఈ సమాచారం ముందే లీక్ అయ్యింది. ‘బ్రో’ సినిమాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి ఫిర్యాదు చేసేందుకు అంబటి రాంబాబు ఢిల్లీకి వెళుతున్నట్లుగా ఉదయం నుంచీ ప్రచారం జరిగింది. సాయంత్రానికి అంబటి ఢిల్లీ పర్యటనపై ‘ఖరారైన వార్త’ బయటకు వచ్చింది.

అయితే, ముఖ్యమైన పని మీద ఢిల్లీకి వెళుతున్నట్లు అంబటి రాంబాబు చెప్పారు తప్ప, ‘బ్రో’ సినిమా మీద ఫిర్యాదు చేయడానికి వెళుతున్నట్లుగా మాత్రం ప్రకటించలేదు. ఏంటీ.. సినిమా మీద ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వెళ్ళడమా.? అన్న వెక్కిరింత వస్తుంది కాబట్టి, అంబటి వ్యూహాత్మకంగా వ్యవహరించి వుండొచ్చు.

పోలవరం ప్రాజెక్టు సంబంధిత విషయాలపై కేంద్రంతో చర్చల నిమిత్తం జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీకి వెళుతున్నారనీ, వీలు చూసుకుని ‘బ్రో’ సినిమా విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి ఫిర్యాదు చేస్తారనీ వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

‘బ్రో’ సినిమా నిర్మాణం కోసం వినియోగించిన నిధుల్ని, విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చినవిగా అనుమానిస్తున్నారు మంత్రి అంబటి రాంబాబు. అయితే, ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ లెక్క వుందని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు.

మరోపక్క, ఈ సినిమా కోసం రోజుకి రెండు కోట్ల రూపాయల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రోజుల లెక్కన.. మొత్తంగా యాభై కోట్ల పైనే జనసేనాని రెమ్యునరేషన్ తీసుకున్నట్లయ్యింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, అంబటి ఫిర్యాదుతో రంగంలోకి దిగితే ఏమవుతుందో వేచి చూడాలిక.!