ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలా.? మళ్ళీ అవే ఊహాగానాలెందుకో.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికల దిశగా కసరత్తులు ముమ్మరం చేశారట. అలాగని మళ్ళీ గాసిప్స్ జోరందుకున్నాయి. గత కొంతకాలంగా ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు రావడం, వాటిని వైసీపీ ఖండించడం.. ఇదంతా ఓ ప్రసహనంగా మారిపోయింది.

‘ఈసారి పక్కా.. డిసెంబరులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.. అదీ తెలంగాణతోపాటే..’ అంటూ ఇంకోసారి ముందస్తు ప్రచారం షురూ అయ్యింది. ఈ ముందస్తుపై కీలక నిర్ణయం తీసుకోవడానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళతారట కూడా.

ఢిల్లీకి వెళ్ళడం ఎందుకు.? వైసీపీ అధినేతకు, ఇంకో అధిష్టానం అయితే ఏదీ లేదు కదా.! ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు చాలామంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన, ముందస్తు ఎన్నికలు.. ఈ లింకు ప్రచారం చాలాకాలంగా చూస్తున్నదే.

కాగా, వైసీపీ వర్గాల్లో మాత్రం ఈ ముందస్తు ప్రచారం కొంత ఆందోళనకు కారణమవుతోంది. దాంతో, ప్రతిసారీ మీడియా ముందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రావడం.. ముందస్తు ప్రచారాన్ని ఖండించడం జరుగుతూ వస్తోంది.

ఇంకోపక్క, ముందస్తు ప్రచారం నేపథ్యంలో వైసీపీ అధినాయకత్వం కూడా కొంత తడబాటుకి గురవుతోంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలపై అంచనా వేయడం కష్టంగా మారుతోంది. ముందస్తుకి వెళ్ళడమే మంచిదా.? అన్న కోణంలోనూ సమాలోచనలు జరుగుతున్నాయి.

ప్రభుత్వంలో ఎవరున్నా, ‘ప్రజా వ్యతిరేకత’కి భయపడాల్సిందే. ఖచ్చితంగా ఎంతో కొంత వుంటుందది. అది ఎంత.? అన్నదానిపై అంచనా వేసుకుని.. ముందస్తు ఎన్నికపై ఏ క్షణాన అయినా ‘కీలక’ నిర్ణయం తీసుకోవచ్చేమో.!