Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయన, శనివారం మధ్యాహ్నం 10 జన్ పథ్‌లో రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంటపాటు కొనసాగగా, తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన కుల గణనపై రేవంత్ రాహుల్‌కు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీసీల జనాభా అధికంగా ఉండటంతో, రిజర్వేషన్లను 42%కి పెంచే అంశంపై కూడా రాహుల్ అనుమతి కోరినట్లు సమాచారం. అలాగే, టీపీసీసీ పునర్వ్యవస్థీకరణపై ఇద్దరూ లోతుగా చర్చించారని తెలుస్తోంది. మరోవైపు, వాయిదా పడుతున్న కేబినెట్ విస్తరణపై రేవంత్ ప్రస్తావించినా, రాహుల్ పెద్దగా ఆసక్తి కనబర్చలేదని సమాచారం.
Modi – Revanth: మోదీ వ్యాఖ్యలపై రేవంత్ కౌంటర్ – బీసీ కుల గణనపై స్పష్టత
కాంగ్రెస్ టీపీసీసీ ఇంచార్జీగా దీపాదాస్ మున్షిని తొలగించి, ఆమె స్థానంలో మీనాక్షీ నటరాజన్‌ను నియమించిన విషయం తెలిసిందే. రేవంత్ ఈ నియామకంపై రాహుల్‌తో చర్చించి, ఆమె సలహాలను తీసుకుంటూ ముందుకు వెళ్లేలా తన కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. మీనాక్షీ రాహుల్ నమ్మకస్తురాలిగా ఉండటంతో, ఆమెకు మరింత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇటీవల ఢిల్లీ టూర్‌లో రేవంత్‌కు అపాయింట్‌మెంట్ లభించలేదు. అయితే, ఈసారి రాహుల్‌తో మరుసటి రోజే భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రేవంత్ భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు కీలకంగా మారబోతున్నాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.