ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అది అమరావతి మాత్రమే. కానీ, కేంద్ర ప్రభుత్వం అమరావతి విషయంలో మళ్ళీ గందరగోళానికి తెరలేపింది. వైఎస్ జగన్ సర్కారు కోరుతున్నట్లు మూడు రాజధానులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడంలేదు. అదిప్పుడు కోర్టు పరిధిలోని అంశం.
చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి రాజధాని అయ్యింది. కేంద్రం కూడా అమరావతిని రాజధానిగా నోటిఫై చేసింది. కానీ, రాష్ట్రానికి సంబంధించి గత కొన్ని నెలలుగా కేంద్రం రాస్తోన్న లేఖల్లో అడ్రస్ అమరావతి కాకుండా, హైదరాబాద్ అనే వుంటున్నాయి. అంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని తెలంగాణలోని హైద్రాబాద్ అని కేంద్రం భావిస్తోందా.? అవుననే అనుకోవాలేమో. నిజమే, పదేళ్ళ పాటు ఆంధ్రపదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని.
తెలంగాణలో అంతర్భాగం కాబట్టి హైద్రాబాద్, తెలంగాణ రాష్ట్రానికి పరిపూర్ణమైన రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఉమ్మడి రాజధాని. అయినాగానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత రాజధాని నిర్మాణం కోసం హైద్రాబాద్ నుంచి రాజధానిని తరలించిన విషయం విదితమే. అది చంద్రబాబు హయాంలో జరిగింది. కానీ, ఇప్పటికీ హైద్రాబాద్ మీద ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి కొన్ని హక్కులున్నాయి. వాటిని వినియోగించుకోవడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పటి జగన్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమవుతున్నాయి.
అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు.. అమరావతికి వెళ్ళాక.. ఇంకా ఈ రాజధాని పంచాయితీ ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. నిజానికి, ఇది కేవలం రాజకీయ గందరగోళం మాత్రమే. కేంద్రం కూడా ఈ రాజకీయ క్రీడలో భాగమవుతుండడం అత్యంత దురదృష్టకరం. ఆంధ్రపదేశ్ రాజధాని ఒకటా.? మూడా.? మీరే తేల్చుకోండంటూ బంతిని ఏపీ కోర్టులోకి నెట్టేసి చేతులు దులుపుకున్నట్టుంది కేంద్రం, తన లేఖల్లో హైద్రాబాద్ అడ్రస్‌ను రాష్ట్ర రాజధానిగా పెట్టి ఎగతాళి చేస్తుండడం.