పార్టీ కోసం పని చేసేది మేము, టీవీల్లో కనిపించేది మీరా… ఏపీ బీజేపీలో కొత్త వివాదం

ఏపీ బీజేపీ మీడియా ప్రతినిధుల జాబితా సరికొత్త వివాదానికి తెరలేపింది. పార్టీ తరపున క్షేత్ర స్థాయిలో పనిచేసేది మేమైతే టీవీలో కనిపించేది మీరా అంటూ… అవకాశం రాని వారు పార్టీ నాయకత్వంపై విరుచుకుపడుతున్నారు. వార్త ఛానళ్లు నిర్వహించే చర్చల్లో వీళ్లే పాల్గొనాలంటూ ఏపీ బీజేపీ శాఖ ఓ జాబితా విడుదల చేసింది. అధికార ప్రతినిధులతో సహా మొత్తం 28 మంది పేర్లు జాబితాలో చేర్చింది. అయితే ఇందులో చాలా మందికి సరిగ్గా మాట్లాడడమే రాదు…మరోవైపు పార్టీ వాయిస్ గట్టిగా వినిపించగలిగే శక్తి ఉన్న కొందరికి ఈ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో ఈ కొత్త జాబితా పార్టీలో అంతర్గతంగా రచ్చ రచ్చ చేస్తోంది.

Somu Veerraju takes charge as Andhra BJP President

అయితే ఈ జంబో జాబితా వెనక పెద్ద మతలబే ఉందని సమాచారం. పార్టీ తరపున టీవీ చర్చల్లో పాల్గొంటున్న కొందరు కోవర్టులుగా మారి పార్టీకి నష్టం కలిగిస్తున్నారని సోమువీర్రాజుకు సమాచారం అందిందంట. వేరే పార్టీ ప్రయోజనాలను కాపాడే విధంగా సదరు టీవీ ఛానళ్లలో వీళ్లు మాట్లాడుతున్నారని సమాచారం అందడంతో ఈ జంబో జాబితాను విడుదల చేశారంట ఏపీ బీజేపీ అధ్యక్షుడు. కోవర్టుల సంగతి సరే మరి ఎప్పటి నుంచో టీవీ చర్చల్లో పాల్గొంటున్న మాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని రమేష్ నాయుడు, పాతూరి నాగభూషణం, రఘురాం వంటి వారు మండిపడుతున్నారు.

ఇక మరోవైపు మీడియా ప్రతినిధుల జాబితాలో చోటు దక్కని ఆఫీస్ బేరర్లు కూడా ఇప్పుడు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. టీవీల్లో కనపడని దానికి ఆఫీస్ బేరర్లుగా పనిచేయడం దేనికని ప్రశ్నిస్తున్నారు. టీవీల్లో కనిపిస్తేనే నాయకుడు అన్న ఫీలింగ్ జనంలో బాగా ఉన్నందున ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తమను అడ్డుకోవడం సరికాదని వాదిస్తున్నారు. మొత్తం మీద ఈ అసంతృప్తులను ఏవిధంగా బుజ్జగిస్తారో వేచి చూడాలి. కోవర్టులకు చెక్‌ పెట్టేందుకు ఏపీ బీజేపీ చేసిన ప్రయోగం.. ఈ సరికొత్త ప్రయోగం బెడిసి కొట్టే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయని పార్టీ నాయకులే అంటున్నారు.