ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎదిగేందుకు భారతీయ జనతా పార్టీకి అత్యద్భుతమైన అవకాశం దక్కింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. వారిలో కొందరికి రాజ్యసభ పదవీ కాలం ఇటీవల ముగిసిందనుకోండి.. అది వేరే సంగతి.
ఏపీలో బీజేపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వున్నాగానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఎందుకు ఎదగలేకపోతోంది.? అంటే, బీజేపీలో మూడు, నాలుగు గ్రూపులు వుండడం వల్లేనన్నది నిర్వివాదాంశం. ఓ గ్రూపు వైసీపీకి మద్దతుగా పనిచేస్తోంటే, ఇంకో గ్రూపు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేస్తుటుంది. జనసేన పట్ల సానుభూతి ఇంకో గ్రూపుకి వుంది. నిఖార్సయిన బీజేపీ వాదులది మరో గ్రూపు.
నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయింది. టీడీపీ తర్వాత కాస్తో కూస్తో బలం వున్నది జనసేన పార్టీకే. కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ ‘యాక్టివ్ పాలిటిక్స్’ చేయలేకపోతున్నారు. అంటే, నిత్యం జనంలో వుండలేకపోతున్నారు. అలాంటప్పుడు, బీజేపీనే కదా.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.?
కొందరేమో టీడీపీకి మద్దతిస్తున్నట్లు మాట్లడతారు. మరికొందరు జనసేన మీద ప్రేమ చూపిస్తారు. ఇంకొందరు వైసీపీ మీద సానుభూతితో వుంటారు. దాంతో, నిఖార్సయిన బీజేపీ నేతలది అయోమయ స్థితి అయిపోతోంది. ప్రత్యేక హోదా సహా ఏ అంశంలోనూ ఏపీ బీజేపీ నేతల్లో స్పష్టత లేదు.
అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంవాల్లో జాతీయ పార్టీతో సంప్రదింపులు జరపడం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం.. ఇవేవీ చేయని బీజేపీ, పనిగట్టుకుని వైసీపీ మీద చేసే విమర్శల కారణంగా, తనను తాను సర్వనాశనం చేసుకుంటోంది రాజకీయంగా.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?
నిండా మునిగినోడికి చలేంటన్నట్టు.. ఎటూ ఏపీలో బలపడే అవకాశం లేదు గనుక, అర్థం పర్థం లేని రాజకీయాలు చేస్తూ, పార్టీని నాశనం చేసుకుంటున్నారు ఏపీ కమలనాథులు.