బీజేపీనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకు అతి పెద్ద సమస్య.!

BJP

భారతీయ జనతా పార్టీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలకు మినహా ఏ రాజకీయ పార్టీకీ వైరం లేకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమే. వైసీపీలో ఒకరిద్దరు నేతలు అడపా దడపా ఏపీ బీజేపీని విమర్శిస్తారేమోగానీ, మొత్తంగా వైసీపీ అయితే, బీజేపీ జాతీయ నాయకత్వాన్నిగానీ, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్నిగానీ గట్టిగా ప్రశ్నించే పరిస్థితే లేదు.

జనసేన ఎలాగూ బీజేపీకి మిత్రపక్షమే గనుక, బీజేపీని జనసేన ప్రశ్నించడం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇక, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీది ఇంకో కథ. గతంలో బీజేపీ మీద నిప్పులు చెరిగిన చంద్రబాబు, ఇప్పుడు అస్సలు బీజేపీని ఏమీ అనడంలేదు. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెను శాపంగా మారుతోంది.

కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన వైసీపీ, తానే మెడలు వంచేసుకుని కేంద్రం ముందు నిలబడాల్సి వస్తోంది. కేంద్రం, రాష్ట్రానికి సాయం చేసినా, చెయ్యకపోయినా.. కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితే లేదు వైసీపీకి. ప్రశ్నిస్తే ఏమవుతుందో వైసీపీకి బాగా తెలుసు.

2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా సహా చాలా అంశాలు ఎజెండాగా వైసీపీ హంగామా చేసింది. కానీ, ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయింది. అంతకు ముందు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో నిరాహార దీక్ష కూడా చేశారు. వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు అస్సలు నోరు మెదపట్లేదు.. కేంద్రం మీద.

2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఏం చెబుతాయి.? ప్రత్యేక హోదా, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ అంశం.. ఇలా చాలా వ్యవహారాలపై స్పష్టత ఇవ్వాల్సిన ప్రధాన పార్టీలు, ఎలాంటి కప్పదాటు వైఖరి అవలంబిస్తాయో వేచి చూడాల్సిందే.