రేపు ఏపీ బంద్‌..వైసీపీ సంఘీభావం..బీజేపీ-జనసేన దూరం

విశాఖఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను నిరసిస్తూ.. కార్మిక సంఘాలు రేపు (మార్చి 5న) ఏపీ బంద్‌కు పిలుపునిచ్చాయి. వైజాగ్ స్టీల్ కార్మిక సంఘాలతోపాటు వామపక్షాలకు చెందిన అన్ని కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ నిర్వహించనున్నాయి. ప్రతిపక్ష టీడీపీ సైతం ఈ బంద్‌కు మద్దతునిస్తున్నట్లు ప్రకటించింది. ఏపీ బంద్‌కు వైసీపీ సైతం సంఘీభావం ప్రకటించింది. రాష్ట్ర బంద్‌కు మద్దతుగా రేపు మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అవుతాయని మంత్రి పేర్ని నాని తెలిపారు.

మధ్యాహ్నం తర్వాత బస్సులు రోడ్డెక్కుతాయని.. సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని మంత్రి తెలిపారు. కొన్ని సంస్థలు ప్రభుత్వం చేతిలో ఉంటేనే ధరలు అదుపులో ఉంటాయని నాని వ్యాఖ్యానించారు. అందుకే ఆర్టీసీని ప్రజల ఆస్తిగా ఉంచామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాము ఆర్టీసీని అప్పుల నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తోందని.. అలాగే కేంద్రం కూడా స్టీల్ ప్లాంట్‌ను అప్పుల నుంచి బయట పడేసేందుకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని మంత్రి పేర్ని నాని సూచించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే వైజాగ్ నగరంలో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించొద్దని కోరుతూ.. సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రం తీసుకున్న వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంతో ఇరుకున పడ్డ వారిలో బీజేపీ-జనసేన పార్టీలు ముందువరుసలో ఉన్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేక, అలాగని అంగీకరించి స్ధానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే పరిస్ధితి లేక ఇరుపార్టీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికీ కేంద్రం స్టీల్‌ ప్లాంట్‌పై నిర్ణయం తీసుకోలేదని చెప్పుకుంటన్న బీజేపీ నేతలు ఈ బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. స్టీల్‌ ప్లాంట్ వ్యవహారాన్ని ఏఫీలో అధికార, విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్న బీజేపీ-జనసేన కూటమి రేపటి బంద్‌కు దూరంగా ఉండనుంది.