టాలీవుడ్ అందాల భామలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే సమంత..అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకొని శ్రీమతిగా మారింది. ఇక గత ఏడాది కలువ కళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్ళాడింది. ఈ పెళ్లి జరగిన కొద్ది రోజులకే మెగా హీరోయిన్ నిహారిక తన స్నేహితుడు చైతన్యని రాజస్థాన్‌లోని జోధ్‌ఫూర్ ప్యాలెస్ వేదికగా పెళ్ళాడింది. ఇక ఈ ఏడాది మొదట్లో సునీత రెండో పెళ్లి చేసుకోగా, ఇటీవల ఎఫ్ 2 భామ మెహరీన్ కౌర్ భవ్య అనే వ్యక్తితో మార్చిలో నిశ్చితార్ధం జరుపుకోనున్నట్టు తెలిపింది. అంటే ఈ అమ్మడి పెళ్ళి కూడా త్వరలోనే ఉండనుంది.
ఇక ఇప్పుడు అను ఎమ్మాన్యుయేల్ పెళ్లి విషయం హాట్ టాపిక్‌గా మారింది. ‘యాక్షన్ హీరో బైజు అనే మలయాళ చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన అను ఎమ్మాన్యుయేల్ తెలుగులో నాని, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య వంటి హీరోలతో కలిసి పని చేసింది. ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహాసముద్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్ధ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
అను ఎమ్మాన్యుయేల్ కెరీర్ సజావుగా సాగడం లేదు. ఈ క్రమంలో ఆమె ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణని వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. 2017లో గోపిచంద్ హీరోగా జ్యోతికృష్ణ ఆక్సీజన్ అనే సినిమా తెరకెక్కించాడు. ఇందులో అను ఎమ్యాన్యుయేల్ కథానాయికగా నటించింది. ఈ సినిమా షూటింగ్‌లో అను, జ్యోతికృష్ణల మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళేలా కనిపిస్తుంది. ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నట్టు తెలుస్తుండగా, త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలుస్తుంది.