ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసు మళ్లీ చర్చకు దారితీస్తోంది. ఈ కేసులో ప్రమోషన్ చేసిన సినీ ప్రముఖులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు యాప్‌లకు ప్రచారం చేసి ప్రజలను ఆకర్షించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటులు, నటీమణులకు నోటీసులు జారీ చేశారు.
తాజాగా దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి లాంటి టాప్ సెలబ్రిటీలకు ఈడీ నుంచి విచారణకు హాజరుకావాలని సూచిస్తూ సమన్లు వెళ్లాయి. ఈనెల 21న వీరికి నోటీసులు అందగా, ఇందులో దగ్గుబాటి రానాను జూలై 23న, ప్రకాశ్ రాజ్‌ను 30న, విజయ్ దేవరకొండను ఆగస్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.
అయితే రానా ఈ రోజు విచారణకు రావాల్సి ఉండగా, షూటింగ్ షెడ్యూల్ కారణంగా విరమించుకున్నట్లు సమాచారం. షూటింగ్ కారణంగా తనకు మరింత సమయం కావాలని ఈడీకి రానా తెలియజేయగా, అధికారులు ఆగస్టు 11న తప్పకుండా విచారణకు హాజరుకావాలని మరోసారి సమన్లు జారీ చేశారు. బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు, నిధుల మళ్లింపుపై ఈడీ దృష్టి సారించింది. ఈ యాప్‌లను సోషల్ మీడియా, యూట్యూబ్, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విస్తృతంగా ప్రోత్సహించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
ప్రముఖ సినీ నటులు ఈ యాప్‌లకు ప్రచారం చేయడం వల్ల లక్షలాది మంది వినియోగదారులు పెట్టుబడులు పెట్టారని, కొంత మందికి ఆర్థిక నష్టం తప్పలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాప్‌ల ప్రమోషన్‌కి సంబంధించి వారిని ఎన్ని విస్తృత స్థాయిలో అగ్రిమెంట్‌లు చేసుకున్నారో, ఎంత మొత్తంలో పారితోషికం తీసుకున్నారో తెలుసుకునేందుకు ఈడీ ఇప్పటికే మరిన్ని ఆధారాలను సేకరిస్తోంది.
తాజాగా ఈడీ అడిగిన ప్రశ్నలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత వీరిపై ఉందని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలో బడా నటీనటులు ఇలాంటి వివాదాస్పద యాప్‌లకు ప్రచారం చేయడం అసలు అవసరమా.. అనే చర్చలు ప్రస్తుతం సినీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి ఈ కేసు ఇంకా ఎన్ని చాప్టర్లను తేలుస్తుందో చూడాలి.
