మాన్సాస్ ట్రస్ట్ ఆస్తుల విషయంలో ఇటీవలే ఆ సంస్థ చైర్ పర్సన సంచయిత అశోక్ గజపతి రాజు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇరువురు మాన్సాస్ ట్రస్ట్ ఆస్తుల్ని పంచుకున్నారని… చంద్రబాబు…బాబాయ్ అశోక్ గజపతిరాజుల కారణంగానే మాన్సాస్ సంస్థ నష్టాల్లో ఉందని అన్నారు. గజపతిరాజు కుటుంబం నుంచి వారసురులిగా తాను రంగంలోకి దిగడంతో ట్రస్ట్ మళ్లీ ఆర్ధికంగా పుంజుకుంటుందని తెలిపారు. అయితే ట్రస్ట్ విషయంలో తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. తెరపైకి కొత్తగా పూసపాటి ఆనంద గజపతిరాజు భార్యసుధ, కుమార్తె ఊర్మిళ గజపతిరాజు వచ్చారు.
తామే ఆనందగజపతి రాజు అసలైన వారసులమని ప్రకటించుకున్నారు. 1991 లో ఆనంద గజపతి రాజు నుంచి సంచయిత తల్లి ఉమా గజపతిరాజు విడాకులు తీసుకున్నారని, అందుకు తగ్గ ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయన్నారు. తన తండ్రి స్వహస్తాలతో రాసిన వీలునామా ఆధారంగా ఆస్తులన్నీ తమకే చెందుతాయని ఊర్మిళా గజపతిరాజు పేర్కొన్నారు. సంచయితకు సంబంధించి ఆస్తులు ఆమెకు పెళ్లి కాకుండా విక్రయించకూడదని, ఆవిషయం పత్రాల్లో స్పష్టంగా రాసి ఉందని ఊర్మిళ తరుపున న్యాయయవాది కూడా అంటున్నారు. ఆమె ఆస్తుల్ని అమ్మడం అనేది చట్టప్రకారం విరుద్దమన్నారు.
ఆనంద గజపతిరాజు వారసురాలిగా సంచయిత ఒక్క ఆధారాన్నైనా చూపించాలన్నారు. వారసత్వ హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తామని సుధ, ఊర్మిళ తెలిపారు. అలాగే చెన్నైలో ని ఓ ఆస్తి విషయంలో సంతకాలు పోర్జరీ చేసారంటూ సంచయిత విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో నోటీసులొచ్చాయని, అందుకే లండన్ నుంచి ఇక్కడకు రావాల్సి వచ్చిందని తెలిపారు. చెన్నైలో జరిగిన విషయాన్ని విశాఖలో జరిగినట్లు చిత్రీకరించి ఫిర్యాదు చేసారన్నారు. దీంతో ఈవివాదం కొత్త మలుపు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. మరి సుధ, ఊర్మిళ ఆరోపణలపై సంచయిత ఎలా స్పందిస్తారో చూడాలి.