ఉత్తరాంధ్రలో వైసీపీకి అంత పెద్ద డ్యామేజ్ జరిగిందా.?

Sanchaita

Sanchaita

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం.. ఉత్తరాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కింది స్థాయిలో ఎక్కువగానే డ్యామేజ్ చేసేసింది. అదే అశోక్ గజపతిరాజు – సంచయిత వివాదానికి సంబంధించినది. మన్సాస్ ట్రస్ట్ వ్వహారాలు, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త వ్యవహారం.. ఈ రెండిటినుంచీ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుని తప్పించి, ఆ స్థానంలో సంచయిత గజపతిరాజుని వైఎస్ జగన్ ప్రభుత్వం కూర్చోబెట్టడం అప్పట్లోనే వివాదాస్పదమయ్యింది.

వైసీపీకి మద్దతుగా మాట్లాడేవారెవరూ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టే అవకాశం లేదు కాబట్టి.. అప్పట్లో అదంతా ఒప్పుగానే చెలామణీ అయిపోయింది. కానీ, కింది స్థాయిలో వ్యతిరేకత బాగా పెరిగింది. దీనికి కారణం, అశోక్ గజపతిరాజు మీద వున్న అభిమానం మాత్రమేనని అనుకోలేం. అశోక్ గజపతిరాజు, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. సరే, రాజకీయాల్లో గెలుపోటములు అన్నది వేరే చర్చ. సంచయిత రంగంలోకి వచ్చాక, చాలా వివాదాస్పద నిర్ణయాలు తెరపైకొచ్చాయి. దాంతో, ఉత్తరాంధ్రలో చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి.

ఉత్తరాంధ్రలోనే వున్న రామతీర్థం దేవాలయంలో రాములోరి విగ్రహం ధ్వంసమయ్యింది.. ఆ దేవాలయానికి అశోక్ గజపతిరాజు విరాళం ఇద్దామనుకుంటే దానికీ అడ్డుపడ్డాయి కొన్ని శక్తులు. అంతెందుకు, ఉత్తరాంధ్రలో అతి పెద్ద జాతర అయిన పైడితల్లి సిరిమాను పండుగ వ్యవహారాన్ని కూడా వివాదాస్పదం చేశారు సంచయిత.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. ఇవన్నీ వైఎస్ జగన్ ఖాతాలోకి ‘నెగెటివ్ మార్కుల’ రూపంలో వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే హైకోర్టు, సంచయిత నియామకాన్ని తప్పు పట్టిందో, ఆ నెగెటివిటీ ఒక్కసారిగా డబుల్.. ట్రిపుల్ అయ్యిందనే చర్చ జరుగుతోంది. సంచయిత ఏమన్నా వైసీపీ నేతనా రిస్క్ తీసుకోవడానికి.? బీజేపీ నేత సంచయిత కోసం వైసీపీ అధిష్టానం ఎందుకిలా పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెట్టినట్లు.?