అసలు మన్సాస్ ట్రస్టులో ఏముంది.? ట్రస్టు ఛైర్మన్ పదవిపై ఎందుకంత మక్కువ.? ఈ పదవి చుట్టూ ఎందుకిన్ని రాజకీయాలు.? కారణం ఒకటే, వందల కోట్ల ఆస్తులు ఈ ట్రస్టు సొంతం. అదీ అసలు కథ. అయినా, రాజ కుటుంబం, వందల కోట్లు.. వేల కోట్ల ఆస్తుల గురించి ఆలోచిస్తుందా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి ప్రస్తుతం అశోక్ గజపతిరాజు చేతికి చిక్కింది. కొద్ది రోజుల క్రితం ఈ పదవిలో అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె సంచైత వున్నారు. అశోక్ గజపతిరాజు నుంచి సంచైత ఈ పదవిని లాక్కోవడం, తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెద్ద రచ్చ జరగడం, హైకోర్టు చీవాట్లతో పదవి తిరిగి అశోక్ గజపతిరాజు చేతికి దక్కడం తెలిసిన విషయాలే. ఇప్పుడిక సీన్‌లోకి ఆనంద గజపతిరాజు మరో కుమార్తె ఊర్మిళ వచ్చారు. మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి తనకు అప్పగించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారామె.
సంచైత, ఊర్మిళ.. ఇద్దరూ ఆనంద గజపతిరాజు కుమార్తెలే. కానీ, వీరిద్దరికీ తల్లులు వేరు. బాబాయ్ అశోక్ గజపతిరాజుతో ఇప్పుడు ఈ ఇద్దరూ పోరుకి దిగినట్లే కనిపిస్తోంది. మన్సాస్ ట్రస్టు నిబంధనల్లో, పురుష సంతానానికి మాత్రమే ట్రస్టు ఛైర్మన్ పదవి ఇవ్వాలని రాసి వుందట. ఆ కారణంగా అశోక్ గజపతిరాజు మాత్రమే ఆ పదవి చేపట్టాల్సి వుటుందన్నది ఓ వాదన. మరి, అశోక్ తర్వాత ఎవరు.? అంటే, వారసులంతా అమ్మాయిలే కావడంతో, అది మళ్ళీ కొత్త రచ్చ అవబోతోందేమో. అయినా, అశోక్ గజపతిరాజు జీవించి వుండగా, ట్రస్టు ఛైర్మన్ విషయమై ఇంత వివాదమెందుకు.? అన్నది స్థానికంగా వినిపిస్తోన్న వాదన. రాజకీయంగా అశోక్ గజపతిరాజుతో విభేదించేవారు కూడా, మన్సాస్ ట్రస్టు విషయంలో ఆయన్ని సమర్థిస్తున్నారు. కానీ, అనవసర రాజకీయం.. మన్సాస్ ట్రస్టుని ఇలా వివాదాల్లోకి లాగేసిందన్నమాట.