ఏపీ సీయం జగన్ కోరి కష్టాలను తెచ్చుకుంటున్నారా.. ? ఏమో మారుతున్న పరిస్దితులను చూస్తుంటే కొందరికి ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయట.. ఎందుకంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తో పాటుగా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ దేశవ్యాప్తంగా తుఫాను రేపుతుందట.. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ వైఎస్ జగన్‌కు రాసిన లేఖను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయగా, తాజాగా, సుప్రీం కోర్టులో మరో సంచలన పిటిషన్ దాఖలైంది. అదేమంటే ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారట.
ఇదివరకే ఏపీ సీఎం జగన్‌పై దాదాపు 30 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, ఇలాంటి వ్యక్తి.. కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.. కాగా, ఈ పిటిషన్ మరో రెండు, మూడు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందట. అలా కానీ పక్షంలో ఈ నెల 26 దసరా సెలవుల తర్వాత అయినా ఈ పిటిషన్ విచారణకు వచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.. ఇకపోతే ఈ వివాదం రోజు రోజుకు ముదురుతున్న నేపధ్యంలో ఉన్న తలనొప్పులు చాలవని వైఎస్ జగన్ మరో కొత్త తగవు తెచ్చిపెట్టుకుంటున్నారా అని ఆ పార్టీ నాయకుల్లో చర్చలు ఇప్పటికే ఆరంభం అయినట్లుగా సమాచారం..
ఇక దాదాపుగా ఈ మధ్యకాలంలో ఒక రాష్ట్రానికి సీయం అయిన ఏ వ్యక్తి చుట్టు కూడా ఇన్ని సమస్యలు దాడి చేయలేదు.. ఇంతలా ప్రచారంలోకి రాలేదు.. కానీ ఒక్క వైఎస్ జగన్ విషయంలోనే ఇన్ని ఆరోపణలు, వీటితోనే సమయం గడిచిపోతుంటే సంక్షేమం, అభివృద్ధి అనే పదాలు మాటల్లోనే ఉంటాయి కానీ చేతల్లోకి రావు అని ప్రతిపక్షాలు చంకలు కొట్టుకుంటున్నాయట.. ఇక టీడీపీకి అయితే ప్రస్తుతం న్యాయవాదుల వివాదం ముదరడం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా భావిస్తున్నారట.. మరి చూడాలి.. రానున్న కాలంలో ఏపీ రాజకీయాల్లో జరిగే వింతలు ఏంటో..