సిడ్నీ టెస్ట్ లో విహారి, అశ్విన్ ఓటమి తప్పించుకున్నామనే ఆనందంలో ఉన్న భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్. జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరిగే ఆఖరి టెస్ట్ కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్న బుమ్రా చివరి మ్యాచ్ ఆడటం లేదని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
అయితే బుమ్రా గైర్హాజరీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ బుమ్రా దూరమైతే భారత్‌కు కష్టాలు తప్పవు. ఇప్పటికే స్టార్ పేసర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాలతో దూరమవ్వగా.. మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ అనుభంలేని బౌలర్లతో బుమ్రా బౌలింగ్ విభాగాన్ని నడిపించాడు.
ఇప్పుడు అతను కూడా దూరమైతే జట్టులో అంతా అనుభవలేమి బౌలర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. పైగా రవీంద్ర జడేజా, హనుమ విహారీ, కేఎల్ రాహుల్‌లు కూడా గాయాల బారిన పడి సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు. జట్టులో ఉన్న అశ్విన్, పంత్ కూడా స్వల్ప గాయాలతో సతమతమవుతున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో సిరీస్ డిసైడర్ మ్యాచ్ అయిన నాలుగో టెస్ట్‌లో భారత్ ఏమేరకు రాణిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.