అప్పుల్లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ .. ?

అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచినట్టు గత రాత్రి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పది నెలల లెక్కలను విడుదల చేసిన కాగ్.. జనవరి నెలాఖరు వరకు ఏపీ రూ. 73,912.91 కోట్లను అప్పుల రూపంలో సమకూర్చుకున్నట్టు తెలిపింది.గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడి పెరిగినప్పటికీ రుణాలు మాత్రం భారీ స్థాయిలో పెరగడం గమనార్హం.

2010-20 ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలఖారు వరకు రెవెన్యూ రాబడి రూ. 85,987.04 కోట్లుగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.88,238.70 కోట్ల రాబడి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు నాటికి రూ.46,503.21 కోట్ల రుణం ఉంటే ఇప్పుడది ఏకంగా రూ. 73,912.91 కోట్లకు చేరింది. ఈ ఏడాది అప్పు అంచనాతో పోలిస్తే ఇది 153 శాతం అధికం. రాష్ట్రంలో ఖర్చు చేస్తున్న ప్రతి 100 రూపాయల్లో రూ. 45 అప్పుగానే సమకూర్చుకున్నట్టు కాగ్ విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.

బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 2020 నుంచి డిసెంబరు వరకు రూ.44,250 కోట్లను ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రుణంగా సేకరించింది. ఇందుకోసం స్పెషల్ డ్రాయింగ్ సౌకర్యం, చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంది.