ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇందుకోసం ఓ క్యాలెండర్ ను రూపొందించి నెలకు రెండుకు తగ్గకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేలా ప్రణాళికలు రూపొందించింది. అయితే, ఓ పథకం విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. అదే వైఎస్ఆర్ పెళ్లి కానుక. అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా కూడా ఈ పథకంపై స్పష్టత రాలేదు. ఇటీవల విడుదల చేసిన సంక్షేమ పథకాల క్యాలెండర్లోనూ వైఎస్ఆర్ పెళ్లికానుక పథకానికి చోటు దక్కలేదు.
దీంతో ఈ పథకం వస్తుందని ఆశలు పెట్టుకున్నవారిలో ఆందోళన నెలకొంది. 2019 ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే పెళ్లికానుక కింద ఇచ్చే ఆర్ధిక సాయాన్ని పెంచుతామని చెప్పారు. అలాగే , ఆ మేరకు 2019 సెప్టెంబర్ లో పెళ్లి కానుక కింద ఇచ్చే ఆర్ధికసాయాన్ని రూ.లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ పెంపు 2020 ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుందని కూడా చెప్పింది. అయితే , ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చింది. అయితే , లాక్ డౌన్ సడలింపుల తర్వాత పెళ్లిళ్లు జరుగుతున్నా.. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు మొదలుకాలేదు.
ఐతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడాది మార్చి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగించారు. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న 90వేల మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అందాల్సి ఉన్నా నేటికీ స్పష్టత రాలేదు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.350 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అర్హులైన పేదల ఇళ్లలో ఆడపిల్లల విహాస సమయంలో వైఎస్ఆర్ పెళ్లికానుక కింద ఆర్ధిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వారి సామాజిక వర్గాల వారిగా దాదాపు రూ.1,50,000 వరకు ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించినా ఎంతవరకు ఎవరికీ రాలేదు. దీనితో కొందరు ఆందోళన చెందుతున్నారు.