Amaravati: ఒకే రాష్ట్రం ఒకే రాజధాని.. అనే నినాదంతో, రాజధాని అమరావతి కోసం రైతులు 500 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. నిజానికి, ఇదో ప్రత్యేకమైన ఉద్యమం. కులం పేరుతో ఆరోపణలు, ప్రాంతం పేరుతో ఆరోపణలు.. చాలానే వినిపించాయి అమరావతి ఉద్యమం పైన. కొందరైతే మరీ నీఛ స్థాయికి దిగజారిపోయి, ‘కూకట్ పల్లి ఆంటీలు’ అనే విమర్శలూ చేశారు. సరే, ఒకే రాజధాని వుండాలా.? మూడు రాజధానులు వుంటే నష్టమేంటి.? అన్నది వేరే చర్చ.
ముందైతే, ఓ రాజధాని వుండాలి.. అది పూర్తిస్థాయిలో నిర్మితమవ్వాలి. ఆ తర్వాత, మూడేం ఖర్మ.. ముప్ఫయ్ నగరాల్ని, రాజధాని అమరావతికి మించేలా నిర్మించవచ్చు. ఒకే చోట పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించడం ఎంతవరకు సబబు.? అన్నది ఇంకో చర్చ. పరిపాలన వికేంద్రీకరణ.. అనేది మరో టాపిక్. ఒక్కడ మొట్టమొదటి ప్రశ్న, ఒక్క రాజధానికే దిక్కు లేదు.. మూడు రాజధానులు ఎలా.? అన్నది. ఈ ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. సంక్షేమ పథకాల కోసం వేల కోట్లు ఖర్చవుతున్నప్పుడు, రాజధాని అమరావతి కోసం చెయ్యాల్సిన స్థాయిలో ఖర్చు చెయ్యకపోతే, రాష్ట్ర ప్రజల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ‘మీ రాష్ట్రానికి రాజధాని ఏది.?’ అని ఎవరన్నా ఎక్కడన్నా ప్రశ్నిస్తే, సమాధానం చెప్పుకోలేక, సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి దాపురించింది ఆంధ్రపదేశ్ ప్రజలకి, పొరుగు రాష్ట్రాలకు చెందినవారి వద్ద. 500 రోజులుగా ఉద్యమిస్తున్నవారిలో కొందరు, కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన మద్దతుదారులు వుండొచ్చు.. ఓ కులానికి చెందినవారూ ఎక్కువగానే వుండొచ్చు.
అంతమాత్రాన వారు రైతులు కాకుండా పోరు.. అమరావతి వాసులు కాకుండా పోరు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాకుండా పోరు. ప్రభుత్వం బేషజాలకు పోకూడదు ఇలాంటి విషయాల్లో. ముందైతే, అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దాల్సిందే. ఆ తర్వాత విశాఖను ఉద్ధరించేస్తారో, కర్నూలుని కళకళలాడేలా చేస్తారో.. అది పాలకుల ఇష్టం. అమరావతి, ఆంధ్రపదేశ్ బాధ్యత. రాష్ట్రానికి చెందిన మొత్తం ప్రజలంతా, అమరావతి వైపు నిలబడి తీరాల్సిందే. ఎందుకంటే, రైతులు తమ భూముల్ని ఏ పార్టీకీ, ఏ వ్యక్తికీ ఇవ్వలేదు.. రాష్ట్ర ప్రభుత్వానికిచ్చారు.. రాష్ట్రం కోసమిచ్చారు.