Merge Process : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసిపోతే.! ముహూర్తమెప్పుడో.!

Merge Process : చూస్తోంటే, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మళ్ళీ కలిసిపోయేలా వున్నాయి. ఈసారి ఏర్పడబోయే కొత్త రాష్ట్రానికి పేరు ఏం పెట్టబోతున్నారట.? ఆగండాగండీ.. ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి.. అలా వుంది, ఈ సమైక్య రాష్ట్రం అనే ఆలోచన చుట్టూ జరుగుతున్న రగడ.

కేంద్రంలో ఇంకోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోతాయంటూ వింత వాదనను తెరపైకి తెచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి. మొన్న హరీష్ రావు, తాజాగా కేటీయార్.. ఇలా తెలంగాణ రాష్ట్ర సమితిలో అత్యంత కీలకమైన నాయకులు.. పైగా మంత్రులు.. అందునా, కేసీయార్ కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి.

విభజన గాయాలు ఎనిమిదేళ్ళయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘మాన’లేదు. విభజన అన్యాయమైన పద్ధతిలో జరిగిందంటూ సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం విదితమే. మరి, అది అన్యాయమైతే, న్యాయమేంటో.? అన్న చర్చ తెరపైకి రాకుండా వుంటుందా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయడం సాధ్యం కావడంలేదు. విభజన హామీల్ని నెరవేర్చడానికి కేంద్రానికి ‘శక్తి’ సరిపోవడంలేదు. రాష్ట్రం నానాటికీ అప్పుల్లో కూరుకుపోతోంది. అలా అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రం తెలంగాణతో కలిపేస్తే.. ఈక్వేషన్ సెట్టయిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారా.? ఆ సంకేతాలు టీఆర్ఎస్ పార్టీకి ముందే అందాయా.?

ఏమోగానీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో.. ముందు ముందు మళ్ళీ సమైక్య గళం, అదే సమయంలో తెలంగాణలో.. ఆ సమైక్య గళానికి వ్యతిరేక గళం.. వినిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయ లబ్దితో జరుగుతున్న ఈ సమైక్య రచ్చ ఎలాంటి పరిణామాలకు తావిస్తుందో ఏమో.