భవిష్యత్తుపై ఆంధ్రప్రదేశ్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే.!

తెలంగాణ ధనిక రాష్ట్రం.. తెలంగాణలో తలసరి ఆదాయం ఎక్కువ.. తెలంగాణకు కరెంటు కోతలు లేవు.. తెలంగాణ ఐటీ రంగంలో అనూహ్యమైన అభివృద్ధిని సాధిస్తోంది.. సంక్షేమ పథకాల విషయంలోనూ ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది.. హైద్రాబాద్ విశ్వనగరంగా రూపొందుతోంది.. అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఘనంగా చెప్పుకుంది ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశాల్లో.

ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనను తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అయోమయంలో పడేశారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి వారు కోరుకుంటున్నారన్నది కేసీయార్ ఉవాచ. అది నిజమేనా.? అన్నది వేరే చర్చ.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన సందర్భమిది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో రాజధానిని కోల్పోయారు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మూడు రాజధానుల సంగతి తర్వాత, ఒక్క రాజధాని అయినా అత్యంత వేగంగా నిర్మించుకోవాలి. ఓ రాష్ట్రానికి ఏడేళ్ళు సరిపోలేదు రాజధానిని నిర్మించుకోవడానికంటే.. అసలు అక్కడ ఏం జరుగుతోంది.? అన్న ప్రశ్న తలెత్తడం సహజమే.

చంద్రబాబు హయాంలో గ్రాఫిక్స్ రాజధాని.. వైఎస్ జగన్ హయాంలో ప్రకటనల రాజధానులు.. వెరసి, రాష్ట్రమే నష్టపోయింది. తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి, అక్కడి నాయకుల నుంచి ఎగతాళి మాటలు వస్తోంటే, రాష్ట్రం పరువు పోతోంది. ప్రజలేం చేస్తారు.? అధికారంలో వున్న పార్టీలు అలా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాయ్.. అంటే, రాజధాని కోసం.. అభివృద్ధి కోసం ప్రజలే గట్టిగా నినదించాల్సిన పరిస్థితి వచ్చిందిప్పుడు.