ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌కి తీవ్రమైన నష్టం జరిగిందా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమయ్యింది.? రాజధాని లేదు, అభివృద్ధి అసలే లేదు. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప, రాష్ట్ర ఇమేజ్‌ని బిల్డప్ చేసే ప్రయత్నాలేమీ వైసీపీ ప్రభుత్వం చేయకపోవడమేంటి.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

ఓ వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకంటూ దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో హంగామా చేస్తున్నారు. రాష్ట్రానికి ఆ ప్రాజెక్టు వస్తోంది.. రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయ్.. అంటూ అధికార వైసీపీ చెబుతోంది. వీటిల్లో నిజమెంత.?

చంద్రబాబు హయాంలో పెట్టబడుల సదస్సులు విశాఖ కేంద్రంగా జరిగాయి. లక్షల కోట్ల పెట్టుబడులంటూ ఊదరగొట్టేశారు. వాటిల్లో కొన్నయినా కార్యరూపం దాల్చాయా.? లేదాయె. మరి, దావోస్ పర్యటనతో వైఎస్ జగన్ సర్కారు సాధించేదేంటి.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

పెట్టుబడుల సంగతి తర్వాత, అక్కడ దావోస్ హంగామా నడుస్తోంటే, రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. కోనసీమ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్ర ఇమేజ్‌ని దారుణంగా దెబ్బతీశాయి. ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, నిఘా వైఫల్యం ఇక్కడ సుస్పష్టం.

హోం మంత్రి కావొచ్చు, ఇతర మంత్రులు కావొచ్చు.. ‘పర నింద’కే ప్రాధాన్యతనిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రం పరువ పోయిన విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. ఇలాగైతే రాష్ట్రం బాగుపడేదెలా.? అన్న కనీస ఇంగితం అధికార పార్టీలోనే కాదు, ఇతర రాజకీయ పార్టీల్లోనూ లేకపోవడం శోచనీయం.