వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతలా అప్పుల్ని సమర్థించుకుంటున్నా, ఈ అప్పులు భవిష్యత్తులో రాష్ట్రానికి పెను శాపంగా మారనున్నాయన్నది నిర్వివాదాంశం. నిజానికి, వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రమే కొత్తగా అప్పులు చేస్తోందనడం సబబు కాదు. చంద్రబాబు హయాంలో అప్పులు జరిగాయి, అంతకు ముందు కాంగ్రెస్ హయాంలోనూ అప్పులు జరిగాయి. రేప్పొద్దున్న ఇంకో ప్రభుత్వం వచ్చినా అప్పులు చేయాల్సిందే. దనిక రాష్ట్రమైన తెలంగాణ కూడా అప్పులు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దయెత్తున అప్పులు చేయక తప్పడంలేదు. ప్రపంచమే పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది కరోనా పాండమిక్ కారణంగా. అయితే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పూర్తి భిన్నం. రాష్ట్రానికి రాజధాని లేదు.. రాష్ట్రంలో అభివృద్ధి లేదు. దీనికి కారణం ముమ్మాటికీ విభజనే.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోవడమే, 13 జిల్లాల ఆంధప్రద్రేశ్ రాష్ట్రానికి పెను శాపంగా మారింది. అక్కడి నుంచి రాష్ట్రం కోలుకునే పరిస్థితే రావడంలేదు. వున్న ఏకైక మార్గం, కేంద్రం.. రాష్ట్రాన్ని ఆదుకోవడం. కానీ, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, రాష్ట్రాన్ని ఆదుకోవడంలో విఫలమవుతోంది. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇచ్చి వుంటే, ఇప్పుడీ దుస్థితి రాష్ట్రానికి దాపురించేది కాదు. ఇవన్నీ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకూ తెలుసు. కానీ, ఎవరూ కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేరు. కేంద్రంలో అధికారంలో వున్న మోడీ సర్కార్, రాష్ట్రాల్ని అంతలా తొక్కి పడేస్తోంది మరి. అవసరమైనప్పుడు ఆయా పార్టీల మద్దతుని నిర్భయంగా తీసేసుకుంటోన్న మోడీ సర్కార్, ఆయా రాష్ట్రాలకు అవసరమైనప్పుడు మాత్రం, సాయం చేయడంలేదు. ఇలా ఇంకెన్నాళ్ళు.? అంటే, కేంద్రంలో బీజేపీ అధికారంలో వున్నన్నాళ్ళూ ఇదే పరిస్థితి. ఆ తర్వాత ఏం జురుగుతుందో చెప్పలేం. కానీ, ఈలోగా అప్పులు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాయ్. అభివృద్ధిని మరచిన సంక్షేమం.. రాష్ట్రానికి పెను భారమే. వేల కోట్లు, లక్షల కోట్ల అప్పు.. రాష్ట్ర ప్రజల్నినిలువునా తాకట్టుపెట్టేస్తున్నట్లే.!