ఆంధ్రపదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం.. ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పాటైన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్.. ఆర్డినెన్స్ ద్వారా ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో ఒకే ఒక్క రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నిర్వహించి, ‘బడ్జెట్’కి ఆమోదం తెలపాల్సి వస్తోంది. ఇక, 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను 2 లక్షల 29 వేల 779 కోట్ల రూపాయలమేర అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వెనుకబడిన కులాలకు 28.237 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్టులో కేటాయించినట్లు చెప్పారు బుగ్గన. కీలక రంగాలకు మెరుగైన కేటాయింపులు చేసినట్లు వివరించారు. కోవిడ్ నియంత్రణ చర్యల కోసం 1000 కోట్లను కేటాయించామనీ, చిన్నారుల సంక్షేమానికి 16,748 కోట్లు కేటాయించామనీ బుగ్గన వివరించారు.
కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నా సంక్షేమ పథకాలకు కేటాయింపులు తగ్గించడంలేదని అన్నారు. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్ని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన విషయం విదితమే. ఒకే ఒక్క రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్ని నిర్వహించాలనుకోవడమేంటన్నది టీడీపీ ప్రశ్న. కాగా, బీఏసీ సమావేశానికి టీడీపీ హాజరైతే బావుండేదనీ, సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఆ సమావేశంలో నిర్ణయించే అవకాశం వుంటుందనీ, ఆ అవకాశాన్ని టీడీపీ చేజార్చుకుందని వైసీపీ విమర్శిస్తోంది. ఇక, బడ్జెట్ అంచనాల విషయానికొస్తే, కేటాయింపులు ఘనంగానే కనిపిస్తున్నాయి. అయితే, ఖర్చు – రాబడి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేయాల్సి వచ్చిన దరిమిలా, వడ్డీలకే అధిక చెల్లంపులు చేయాల్సిన పరిస్థితి. సంక్షేమం వరకూ ఇబ్బంది కనిపించడంలేదుగానీ, అభివృద్ధి సంగతేంటన్నదే మిలియన్ డాలర్ల పశ్న.