మాన్సాస్ ట్రస్ట్ ఆస్తుల విషయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఇందులోకి మరోసారి చంద్రబాబు నాయుడు కల్పించుకోవడంతో ఆనందగజ పతిరాజు కుమార్తె సంచయిత కుటుంబ ఆస్తుల విషయల్లో కల్పించుకోవద్దని సీరియస్ అయ్యారు. చంద్రబాబు, బాబాయ్ అశోక్ గజపతి రాజు కారణంగానే ఆస్తులు కోల్పోవాల్సి వచ్చిందని సంచయిత మరోసారి ఆరోపించారు. ఈవివాదం నేపథ్యంలో ఆనందగజపతిరాజు రెండవ భార్య, కుమార్తె ఇటీవల అమెరికా నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆనంద గజపతి రాజు 70వ జయంతి సందర్భంగా రెండవభార్య, కుమార్తె సుధ, ఊర్మిళలు అశోక్ గజపతి రాజు పై మండిపడ్డారు.
తండ్రి మరణానంతరం బాబాయ్ ఎన్నో రాజకీయ కుట్రలు చేసారని ఊర్మిళ ఆరోపించారు. సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ విషయంలో బాబాయ్ కుళ్లు రాజకీయాలు తమని ఎంతో బాధకు గురిచేసాయన్నారు. మాన్సాస్ నుంచి తమని దూరం చేయాలని ఎంతో ప్రయత్నించారని, ఇప్పటికీ ఆ ప్రయత్నాలు మానుకోలేదని వాపోయారు. తన తండ్రి మరణానంతరం ఆయన ఆశయాల సాధానకు కృషి చేస్తున్నానని ఊర్మిళ తెలిపారు. భవిష్యత్ లో అవకాశం వస్తే తప్పకుండా రాజకీయాలలోకి దిగుతానని స్పష్టం చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ పని రాజకీయ అంశంతోనే ముడిపడి ఉందని ఊర్మిళ అభిప్రాయపడ్డారు.
ఆనందగజపతి రాజు చాలా సాధారణ జీవితం గడిపారన్నారు. ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచించేవారన్నారు. తాత ఆశయాల కోసం ఎంతో శ్రమించారన్నారు. దీనిలో భాగంగా ఇంజనీరింగ్ కాలేజీలు సహా పలు కాలేజీలను నిర్మించారన్నారు. మెడికల్ కాలేజ్ స్థాపించాలన్నది నాన్నగారి కల అన్నారు. అయితే ఆయన మరణానంతరం బాబాయ్ మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు చేపట్టే హక్కు లేదని, తమని తప్పించాలని చూసినట్లు ఊర్మిళ ఆరోపించారు. ఎలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని ఆనంద గజపతిరాజు ఆశయాల కోసం పాటు పడతామని తెలిపారు.