అమరావతి దోపిడీ కథ.. ఎప్పటికి తీరేను ఈ వ్యధ.!

Amaravati Land Scam, Never Ending Political Serial

Amaravati Land Scam

రాజధాని అమరావతి పేరుతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. ఇందులో దాపరికం ఏమీ లేదు. వివిధ దేశాల్లో షికార్లు చేసి, ఆయా దేశాల్లోని ప్రముఖ నగరాల మోడళ్ళను పరిశీలించి.. ఏవేవో డిజైన్లు చేయించి, ఆ డిజైన్లకు ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళితో అదనపు హంగులు అద్ది.. చివరికి ఏమీ చేయకుండా వదిలేశారు అమరావతిలో.

అన్నీ తాత్కాలిక ప్రాతిపదకనే నిర్మించేందుకు యత్నించింది చంద్రబాబు ప్రభుత్వం. అలా కొన్ని తాత్కాలిక భవనాలు నిర్మితమయ్యాయి. నిజానికి, పేరు మాత్రమే తాత్కలికం.. అవన్నీ శాశ్వత భవనాలే. ఎప్పుడైతే తాత్కాలికమనే పేరు పెట్టారో, అమరావతి కూడా తాత్కాలికమే అయిపోయింది.

ఇక, అమరావతి పేరుతో కనీ వినీ ఎరుగని రీతిలో భూ కుంభకోణానికి చంద్రబాబు అండ్ టీమ్ పాల్పడ్డారన్నది వైసీపీ ఆరోపణ. ఉత్త ఆరోపణ మాత్రమే కాదు, అధికారంలోకి వచ్చాక మంత్రి వర్గ ఉప సంఘం సహా, సీఐడీ విచారణ కూడా చేపడుతోంది జగన్ సర్కార్.

అయితే, కోర్టుల్లో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో టీడీపీ దోపిడీ బయటకు రావడంలేదు. సరే, కోర్టుల్లో ప్రభుత్వ వాదన సమర్థవంతంగా లేదా.? అంటే, అది వేరే చర్చ. తాజాగా అమరావతి కుంభకోణానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి మరో బాంబు పేల్చారు.

అదే సమయంలో, గతంలో చంద్రబాబు హయాంలో.. అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి కీలక అధికారిగా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్, ఆనాటి వ్యవహారాలపై సీఐడీ విచారణలో కీలకమైన విషయాలు వెల్లడించారనే ప్రచారం జరుగుతోంది.

మరోపక్క, టీడీపీ నుంచి ఓ వీడియో విడుదలైంది.. అందులో వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణలకు పూర్తి వ్యతిరేకంగా కంటెంట్ కనిపిస్తోంది. బెదిరించి భూములు లాక్కున్నారన్నది వైసీపీ వాదన.

కానీ, తాము ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చామని రైతులంటున్నారు. ఏది నిజం.? ఎప్పటికి తేలేను వాస్తవం.? ఏమోగానీ, ఈలోగా అమరావతి పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది.. రాష్ట్రానికి సమీప భవిష్యత్తులో మంచి రోజులు వచ్చేలా కనిపించడంలేదు రాజధానికి సంబంధించి.