ఒక్కోసారి రాజకీయ నేతల నాలుకలు మడతలు పడుతుంటాయి. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కంట్రోల్ కావు. ఫలితంగా వివాదాల్లో చిక్కుకుని నలిగిపోతుంటారు. ఇలాంటి పరిస్థితే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డికి ఎదురైంది. అమరావతిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీల మీద వారికి పీకల్లోతు కోపం ఉంది. అమరావతిని కాపాడలేకపోయిందని టీడీపీ మీద, కలల రాజధానిని నాశనం చేస్తోందని వైసీపీ మీద, ఆనాడు శంఖుస్థాపనకు వచ్చి ఈరోజు చేతులెత్తేశారని వైసీపీ మీద నిప్పులు చెరుగుతున్నారు. ఎవరు దొరికినా నమిలేసేలా ఉన్నారు.
సరిగ్గా ఇలాంటి టైంలోనే విష్ణు వర్థన్ రెడ్డి వారికి చిక్కారు. అమరావతి ఉద్యమంలో రైతు కుటుంబాల మహిళలు యాక్టివ్ పాత్ర పోషిస్తున్నారు. తీవ్రస్థాయి నిరసనలు తెలుపుతున్నారు. లాఠీ దెబ్బలకు, కేసులకు కూడ వెరవట్లేదు. అలాంటివారిని గౌరవించకపోయినా పరువాలేదు కానీ అగౌరవపరచకూడదు కదా. సరిగ్గా అదే చేశారు ఆయన. ఉద్యమంలో కొన్ని పార్టీల మహిళా నాయకులు కూడ పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. వారిలో విజయవాడకు చెందిన ఒక మహిళా నాయకురాలిని ఉద్దేశించి మాట్లాడిన విష్ణు వర్థన్ రెడ్డి విజయవాడలో ఉండే ఒక మహిళా నాయకురాలు మినిమమ్ 50 వేల రూపాయల చీర కట్టుకుని ఉద్యమాల్లో పాల్గొంటుంటుంది. ఫ్యాషన్ షోకు వచ్చినట్టు వస్తుంటుంది ఉద్యమాలకు అంటూ వ్యాఖ్యానించారు.
దీంతో మహిళలు, రైతులు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఆడవాళ్ళ చీరల గురించి వ్యంగ్యంగా మాట్లాడే కుసంస్కారం మీదని, విష్ణు వర్థన్ రెడ్డిగారు గతంలో మీరు చేరాలా దుకాణంలో పనిచేసేవారా అంత కరెక్టుగా రేట్లు చెబుతున్నారు. మీరేమైనా గోచీ కట్టుకుని తిరుగుతున్నారా, మహిళలనే గౌరవం లేకుండా అలా కించపరుస్తారా. జగన్మోహన్ రెడ్డికి మద్దతివ్వడం మానేసి రైతుల కష్టాలను గురించి ఆలోచించండి అంటూ మహిళలు, మహిళా నాయకులు నోటికి పనిచెప్పారు. ఇంకొందరైతే బండబూతులు తిట్టేస్తున్నారు.
వీటిపై స్పందించిన విష్ణు వర్థన్ రెడ్డి మాత్రం తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ మాటలు తాను అనలేదని ఖండించినా కూడ జనం ఆగట్లేదు. ఆయన మాట్లాడిన ఆ మాటల తాలూకు వీడియోలు షేర్ చేసి మరీ ఇవి కూడ ఫేక్ అనే అంటారా అంటూ ఇంకాస్త ఎక్కువగా దులిపేస్తున్నారు.