అమరావతి రగడ: అసలు కథ ఇప్పుడే మొదలైంది

దేవస్థానం నుంచి న్యాయస్థానం వరకు మహా పాదయాత్ర పేరుతో అమరావతి రైతులు, తిరుపతికి తలపెట్టిన పాదయాత్ర ఇప్పటిదాకా సజావుగానే సాగింది. వందలాది మంది రైతులు మహా పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారికి వివిధ పార్టీల నుంచి మద్దతు కూడా బాగానే లభిస్తోంది.

అయితే, ఇప్పటిదాకా అమరావతి పరిధిలోనే (గుంటూరు జిల్లాలోనే) సాగిన పాదయాత్ర, ఇకపై ప్రకాశం జిల్లాలోకి అడుగు పెడుతోంది. రాజధాని ఉద్యమం కేవలం అమరావతి పరిధికే పరిమితం.. అన్న వాదనలున్నాయి. అందుకు అనుగుణంగానే రాజకీయ పరిణామాలూ కనిపిస్తూ వచ్చాయి.

జిల్లా మారాక, పరిస్థితులు ఇంకెలా మారబోతున్నాయ్.? అంటే, రాయలసీమలోకి ఎంటర్ అయ్యేవరకూ కొంతమేర ప్రశాంతంగానే వుంటాయన్న చర్చ జరుగుతోంది. ఏమో, అప్పటికి పరిణామాలు ఎలా వుంటాయోగానీ.. ఇప్పటికే చేపట్టిన పాదయాత్ర కారణంగా కొందరు రైతులు నీరసించిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రానికి రాజధాని అత్యవసరం. అమరావతి విషయంలో వైఎస్ జగన్ సర్కారు కూడా, ‘శాసన రాజధాని’ అంటోంది. కానీ, అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటంలేదు. అదే అసలు సమస్య. అదే సమయంలో అటు విశాఖలోగానీ, ఇటు కర్నూలులోగానీ రాజధాని పేరుతో కొత్తగా జరుగుతున్న అభివృద్ధి కూడా ఏమీ లేదు.

ఒక్కటి మాత్రం నిజం.. రాయలసీమలోకి మాహా పాదయాత్ర ఎంటర్ అయితే, తమ రాజధానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారనే భావనతో అమరావతి రైతుల్ని అడ్డగించేందుకు రాయలసీమ వాసులు ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది లేనిపోని వివాదాలకు దారి తీస్తుంది.