అమర్ రాజా బ్యాటరీస్.. అంటే, ప్రపంచ స్థాయి సంస్థ అది. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని అందిస్తోన్న ప్రముఖ సంస్థ అమర్ రాజా. చిత్తూరు జిల్లాలో రాజకీయాలకతీతంగా స్థానిక ప్రజలు, అమర్ రాజా సంస్థను తమదిగా భావిస్తారు. ఆ సంస్థ ఇప్పుడు తమ కార్యకలాపాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించాలనుకుంటోందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ సంస్థ ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, అమర్ రాజా సంస్థ బాధ్యతల్ని కొన్నాళ్ళ క్రితమే చేపట్టారు. గల్లా కుటుంబానిదే ఈ సంస్థ. ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా అమర్ రాజా సంస్థను వివాదాల్లోకి లాగింది లేదు ఇప్పటివరకూ. కానీ, ఈ మధ్యకాలంలో పరిస్థితి మారింది. దాదాపుగా ప్రతి వారం, ప్రతి నెలా అమర్ రాజా సంస్థకు సంబంధించిన ఏదో ఒక వివాదాన్ని వైసీపీ అనుకూల మీడియా తెరపైకి తెస్తోంది.
అందుకు అనుగుణంగా, వివిధ ప్రభుత్వ శాఖలు ఆ సంస్థపై స్పెషల్ ఫోకస్ పెట్టి, ఆ సంస్థకు కేటాయించిన భూముల్ని తిరిగి తీసుకోవడమో, సంస్థలో పొల్యూషన్ సహా వివిధ అంశాలకు సంబంధించి తనిఖీలు చేస్తూ రగడకు కారణమవడమో చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఈ రాజకీయ వేధింపుల నేపథ్యంలో అమర్ రాజా సంస్థ, చిత్తూరు నుంచి తమ కార్యకలాపాల్ని వేరే రాష్ట్రానికి తరలించాలనే నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. తమిళనాడుతోపాటు, తెలంగాణ అలాగే కర్నాటక రాష్ట్రాలు అమర్ రాజా సంస్థకు రెడ్ కార్పెట్ పరుస్తుండడం గమనార్హం. ఒకవేళ అమర్ రాజా గనుక, చిత్తూరు నుంచి తరలిపోతే, వైఎస్ జగన్ హయాంలో ఇదో అతి పెద్ద ఫెయిల్యూర్ అవుతుందన్నది నిర్వివాదాంశం. అలా జగన్ సర్కారుకి చెడ్డ పేరు తెచ్చేందుకు టీడీపీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే మరి.