Razakar Files : కాశ్మీర్ ఫైల్స్ తరహాలో రజాకార్ ఫైల్స్ ?

Razakar Files : కాశ్మీర్ పండిట్లపై జరిగిన దారుణాలకు ఏమాత్రం తీసిపోనివి రజాకార్ల అరాచకాలు.. అని చరిత్రకారులు చెబుతుంటారు. ఇప్పడంటే తెలంగాణ అంటున్నాంగానీ, ఒకప్పటి హైద్రాబాద్ సంస్థానంలో ఇప్పుడున్న తెలంగాణ కొంత భాగం మాత్రమే. ఆనాటి ఆ హైద్రాబాద్ నుంచి కొంత భాగం మహారాష్ట్రలో మరికొంత భాగం కర్నాకటలో కలవగా, మిగిలిన ప్రాంతమే తెలంగాణ.. అది ఒకప్పుడు ఆంధ్రరాష్ట్రంతో కలిసి, ఇప్పుడది తెలంగాణ రాష్ట్రమైంది.

నిజాం పాలనలో ఈ రజాకార్ల వ్యవహారం ఓ పీడకల. ఆనాటి ఆ దారుణాల్ని ఈనాటికీ గుర్తు చేసుకుంటుంటారు ఇంకా జీవించి వున్న అప్పటి ఉద్యమకారులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రజకార్లపై చర్చ అనేదే లేకుండా పోయిందనుకోండి.. అది వేరే సంగతి.

దేశవ్యాప్తంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా సంచలన విజయాన్ని అందుకోగా, ఇప్పుడు ‘రజాకార్ ఫైల్స్’ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ‘రజాకార్ ఫైల్స్’ ప్రకటన చేశారు. అయితే, ‘రజాకార్ ఫైల్స్’ సినిమా తెరకెక్కుతుందా.? ఇది కేవలం బండి సంజయ్ రాజకీయంగా చేసిన ఓ విమర్శ నుంచి వచ్చిన ఉత్త మాటేనా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ‘రజాకార్ ఫైల్స్’ గనుక సినిమాగా తెరకెక్కితే, తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కే అవకాశం లేకపోలేదు. వచ్చే ఏడాదే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న దరిమిలా, బీజేపీ తలచుకుంటే ‘రజాకార్ ఫైల్స్’ తెరకెక్కించడం పెద్ద వింతేమీ కాకపోవచ్చు. చూద్దాం.. ఏం జరుగుతుందో.!