ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ పార్టీకి పట్టు ఉంటుందో అదే పార్టీ అధికారంలో ఉంటుంది అనే సెంటిమెంట్ ఎక్కువ, అందుకే అక్కడ పట్టు సాధించటం కోసం ప్రధాన పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటాయి. ప్రతిపక్షములో వున్నా టీడీపీ ఎలాగైనా సరే ఆయా జిల్లాలో తమ పూర్వ వైభవం తిరిగి తెచ్చుకోవాలని చూస్తుంది. ఆ క్రమంలోనే అచ్చెన్న నాయుడుకు ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది. అయితే అచ్చెన్నకు ఆ పదవి రాకుండా టీడీపీ పార్టీలో అనేక శక్తులు అడ్డుకున్నట్లు తెలుస్తుంది.
ముఖ్యంగా అయ్యన్నపాత్రుడు ఇందులో కీలకమైన వ్యక్తిగా తెలుస్తుంది. ఈ సారి ఎలాగైనా అధ్యక్ష పదవి లో తాను కూర్చోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేసాడు అయ్యన్న, ఇందులో భాగంగా గత నెల రోజుల నుండి వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేశాడు, కానీ బాబు అవేమి పట్టించుకోకుండా అచ్చెన్నాయుడుని నియమించాడు. అయ్యన్న ఈ పదవి కోసం ఇంతగా పోటీపడటానికి వెనుక నుండి లోకేష్ బాబు హస్తముందని తెలుస్తుంది. అచ్చెన్నాయుడు దూకుడు చూస్తే రాబోయే రోజుల్లో తనకెక్కడ పోటీ అవుతాడేమో అనే భయంతో అయ్యన్న పాత్రుడిని రంగంలోకి దించి, తెరవెనుక మద్దతు ఇచ్చాడు.
అచ్చెన్న విషయంలో లోకేష్ ఏకంగా చంద్రబాబు నాయుడుతోనే వాదనకు దిగినట్లు సమాచారం. అయితే బాబు మాత్రం ఈ పదవి ఎట్టి పరిస్థితులో అచ్చెన్న కు మాత్రమే ఇవ్వాలని, ఇందులో రాజకీయంగా చాలా కోణాలున్నాయని సర్దిచెప్పినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో టీడీపీ లో రెండు వర్గాలు ఏర్పడినట్లు తెలుస్తుంది. అచ్చెన్న నాయుడు అధ్యక్షుడు అయినా కానీ తమ మీద అతను పెత్తనం చేయటానికి వీలులేదని అయ్యన్న వర్గం పెద్దల ఒప్పందం ఒకటి చేసుకున్నట్లు తెలుస్తుంది. అయ్యన్న వర్గానికి లోకేష్ బాబు నాయకత్వం వహిస్తాడని, అచ్చెన్న వర్గం చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుందని అనుకోవచ్చు. గత కొన్నేళ్ల నుండి లోకేష్ తన సొంత కోటరీని తయారుచేసుకోవాలని చేస్తున్నాడు. అందులో భాగంగా బాబుకు దగ్గరి నేతలను దూరం పెట్టి తనకు అనుకూలమైన నేతలను తీసుకోవాలని చూస్తున్నాడు.. ఆ క్రమంలోనే టీడీపీ లో అచ్చెన్న వర్గం అయ్యన్న వర్గం ఏర్పడింది.