కరోనా మహమ్మారి జోరు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పటికి కూడా లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే .. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది. ఇకపోతే , బ్రిటన్ ప్రభుత్వం ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కి ఆమోదం తెలిపింది. ఈ రోజు నుండి దేశ ప్రజలకు యూకే సర్కార్ టీకా ఇచ్చేందుకు అన్నీ ఏర్పాట్లు చేసింది.
అయితే, తొలి టీకా మాత్రం ఓ భారత సంతతి వ్యక్తి వేయించుకోబోతున్నారు. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొదటి వ్యక్తుల జాబితాలో భారత సంతతి వ్యక్తి హరి శుక్లా అరుదైన ఘనత సాధించనున్నారు. తొలుత 80 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్ వర్కర్స్‌కి, హోం కేర్ వర్కర్స్‌కి వ్యాక్సిన్ వేస్తారు.బ్రిటన్‌లోని టైన్ అండ్ వేర్ మెట్రోపాలిటన్‌లో నివాసం ఉంటున్న 87 ఏళ్ల హరి శుక్లా మంగళవారం న్యూ క్యాజిల్ ఆస్పత్రిలో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోనున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్‌లో భాగంగా మొదటి డోసు మంగళవారం ఇవ్వనున్నారు. కాగా, టీకా తీసుకోవడం తన బాధ్యత అని ఈ సందర్భంగా శుక్లా పేర్కొన్నారు.
ఇక బ్రిటన్‌లో అత్యవసర వినియోగంలో భాగంగా మొదటి వారంలో 8 లక్షల డోసుల వ్యాక్సిన్‌లని అందుబాటులోని తీసుకురానున్నారు. కోవిడ్ వల్ల ఎక్కువ ప్రమాదంలో ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి, 80ఏళ్లు పైబడిన వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని బోరిస్ జన్సాన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై పొరాటంలో యూకే నేడు అతి పెద్ద ముందడుగు వేయబోతుంది అని తెలిపారు.