Bear Attack: తాజాగా గుజరాత్ లో ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. గుజరాత్ రాష్ట్రం, చోటే ఉదయపూర్ సిటీ, పావిజేత్ పూర్ తాలూకాలోని అంబా పూర్ గ్రామానికి చెందిన ధర్మేష్ రత్వా అనే వ్యక్తి ఇటీవల జనవరి ఒకటవ తేదీన పొలంలోని బహిర్భూమికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే ఒక ఎలుగుబంటి అతడిపై విరుచుకుపడింది. ఈ క్రమంలోనే ఎలుగు బంటి అతని ముఖ భాగాలన్నీ గుర్తుపట్టలేని విధంగా కొరికేసింది. అతడి ముక్కు, చెవులు, ఎముకలు, కండరాలు, కనురెప్పలు ఇలా శరీరంలోని పలు భాగాల్లోకి తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అతని కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఎస్ ఎస్ జీ ఆస్పత్రికి తరలించారు. అతడి ముఖంలో మూడింట ఒక వంతు భాగం బాగా దెబ్బతింది. ఇక ఆస్పత్రిలోని వైద్యులు నాలుగు గంటల పాటు సర్జరీలు చేసి ముఖానికి ఏకంగా 300 కోట్లు వేసి అతని ముఖాన్ని మళ్ళీ పునర్నించారు.
ఈ సందర్భంగా ఎస్ ఎస్ జి హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శైలేష్ కుమార్ మాట్లాడుతూ.. అతడిని మా వద్దకు తీసుకు వచ్చినప్పుడు అతని ముఖం నిండా, చిన్న చిన్న విత్తనాలు, దుమ్ము, ఆకులు రాళ్ళు ఉన్నాయి. ఆ సమయంలో అతడి పరిస్థితి మరింత విషమించకుండా వెంటనే అతడికి స్టెబిలైజ్ చేయాల్సి వచ్చింది అని తెలిపారు. అలాగే రేబిస్, టెటానస్, యాంటీబయాటిక్ షాట్‌లను అందించిన తరువాత ముఖాన్ని పునర్నిర్మించే శస్త్రచికిత్స చేయడానికి ముందు అతనికి సీటీ-స్కాన్ నిర్వహించాల్సి వచ్చింది అని శైలేష్ కుమార్ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత డాక్టర్ సోనీతో సహా డా.భాగ్యశ్రీ దేశ్‌మాంకర్, డా.నలిన్ ప్రజాపతి, డా.సుదర్శన్ యాదవ్, డా.రిద్ధి సోంపురాలతో కూడిన రెసిడెంట్ వైద్యుల బృందం నాలుగు గంటల పాటు శ్రమించి 300 కుట్లు వేసి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేశారు.
ధర్మేష్ ముక్కు నిర్మాణం పూర్తిగా దెబ్బతినడంతో ఇది సవాలుతో కూడిన శస్త్రచికిత్సగా మారింది. దీంతో సర్జరీ కొనసాగినంత వరకు ధర్మేష్ ని అపస్మారక స్థితిలో ఉంచడానికి డా.కవితా లాల్‌చందానీ, డా.నేహా షా, డా.రిమా గోమేటిలతో కూడిన మత్తుమందుల బృందం అక్కడే ఉండిపోయింది. ఎలుగుబంటి నుజ్జునుజ్జు చేసిన ధర్మేష్ ముఖభాగాల నుంచి కొన్ని భాగాలను రికవరీ చేశాము. మిగిలిన వాటిని మేము ముఖాన్ని పునర్నిర్మించడానికి టైటానియం ప్లేట్లు, మెష్‌లను ఉపయోగించాల్సి వచ్చింది అని తెలిపారు. అలాగే ఎముకలలోని అన్ని భాగాలను రీకనెక్ట్ చేయడం ఒక పజిల్ పూర్తి చేసినట్లు అనిపించింది. సరైన ఎముకలు లేదా బోనీ సపోర్టు లేని చోట్ల టైటానియం ప్లేట్లు పెట్టాం. శ్వాసనాళం నుంచి పూర్తిగా విడిపోయిన ముక్కుకు ఆకారం ఇచ్చిన తర్వాత, నాసికా రంధ్రాలను శ్వాసనాళంతో కుట్టడం జరిగింది అని డాక్టర్ శైలేష్ కుమార్ వివరించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది. మరొక రెండు రోజుల్లో అతన్ని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.