Plane Crash: విమాన ప్రమాదంలో మృతులకు పరిహారం ఎంత వస్తుంది.. ఎవరు ఇస్తారో తెలుసా..?

గుజరాత్‌లో గురువారం జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని మేఘానీనగర్‌లోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై విమానం పడింది. విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్న విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది.

ఇలాంటి దారుణ ఘటనల తర్వాత సాధారణంగా ప్రజల్లో ఒక్క ప్రశ్న కలుగుతుంది. ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం ఎవరు ఇస్తారు? కంపెనీయేనా.. లేక ఇన్సూరెన్స్ సంస్థలేనా.. ఇంటర్నేషనల్ విమాన ప్రమాదాలపై 1999లో మాంట్రియాల్ కన్వెన్షన్ అనే ఒప్పందం కుదిరింది. దీనికి ఇండియాతో పాటు అనేక దేశాలు భాగస్వాములు. ఈ ఒప్పందం ప్రకారం, అంతర్జాతీయ విమాన ప్రమాదాల్లో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతే, వారి కుటుంబాలకు కనీసం రూ.1.4 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రమాదానికి విమాన సంస్థ తప్పే కారణమైతే, ఆ మొత్తాన్ని మరింత పెంచాల్సి ఉంటుంది.

విమాన ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా కీలకం. ఈ పాలసీల ద్వారా ప్రమాదం జరిగినప్పుడు చనిపోయిన వారికి రూ.25 లక్షల నుంచి రూ.1 కోటి వరకు, శాశ్వతంగా వికలాంగత కలిగినవారికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం లభించవచ్చు. అలాగే, హాస్పిటలైజేషన్, లగేజీ పోవడం, విమానం ఆలస్యంగా రావడం వంటి సందర్భాల్లో కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం ఇస్తాయి.

అయితే చాలా మంది భారతీయులు విమాన ప్రయాణాల సమయంలో ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదు. కొందరు తీసుకున్నా, నామినీ వివరాలు నమోదు చేయడం మరిచిపోతారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రయాణికుడు చనిపోయిన తర్వాత నామినీ వివరాలు లేనందున పరిహారం అందక పోవచ్చు. ఇన్సూరెన్స్ ఉంటేనే వంతుగా ఆ నిబంధనలు వర్తిస్తాయి. లేకపోతే కేవలం విమాన సంస్థ ఇస్తున్న పరిహారం మీదే ఆధారపడాల్సి వస్తుంది.

ఇంకా ఒకవేళ ప్రభుత్వానికి చెందిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే లేదా విమాన ప్రమాదానికి ఎవరు బాధ్యులన్న విషయంపై క్లారిటీ లేకపోతే, పరిహారం ఆలస్యం కావచ్చు. కొన్ని కేసుల్లో మృతునికి ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకపోయినా, నామినీ వివరాలు తప్పుగా ఉన్నా పరిహారం రావడం కష్టమే. ఇందుకే ప్రయాణం ఎంత చిన్నదైనా సరే, డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా తప్పకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నామినీ వివరాలు కూడా సరిగ్గా నమోదు చేయాలి. ప్రయాణం ముందస్తు భద్రతతో ఉండాలంటే ఇది ఎంతో అవసరం.