గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్ర నేత విజయ్ రూపానీ.. ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది మృతి చెందగా.. అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారని.. కేంద్రమంత్రి, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధృవీకరించారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం జూన్ 12న జరగగా. ఈ నంబర్ తో రూపానీకి ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కేవలం ఒక తేదీ మాత్రమే కాదు.. విజయ్ రూపానీ జీవితంలో ప్రత్యేక స్థానం కలిగిన లక్కీ నంబర్. ఆయనకు అత్యంత ఇష్టమైన సంఖ్య 1206. అంటే 12వ తేదీ, ఆరవ నెల లక్కీ తనకు అదృష్టం తెచ్చిపెడుతుందని ఆయన ఎప్పుడూ భావించి అనుసరించేవారంట. రూపానీ వాడిన ప్రతి వాహనానికి అదే నంబర్ ఉంటుంది. అంతేకాదు ఆయన వాడిన మొదటి స్కూటర్ నంబర్ కూడా 1206 అని తెలుస్తోంది. దీని బట్టి ఈ సంఖ్య అంతే గుజరాత్ సీఎం కి ఎంత ఇష్టమో చెబుతుంది. ఇక తన స్వస్థలమైన రాజ్‌కోట్‌లో ‘1206’ నంబర్ ఉన్న కారును చూసిన ప్రతీ ఒక్కరూ ఇది రూపానీ కారు అని గుర్తించేవారట.
అయితే దురదృష్టవశాత్తూ అదే 1206, అంటే 12/06 తేదీనే ఆయన జీవితానికి ముగింపు రాసింది. గురువారం మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం, కొద్దిసేపటికే మేఘనినగర్ ప్రాంతంలోని ఓ వైద్య కళాశాల భవనంపై కూలిపోయింది. ప్రమాదంలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు. మొత్తానికి మాజీ సీఎం లక్కీ నంబరే అతనికి చివరి తేదీగా మారింది. గుజరాత్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రూపానీ మరణ వార్త పార్టీ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఆయన నేతృత్వం, నిగ్రహం, సేవాపరమైన ఆత్మీయతను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు.