అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం గుజరాత్ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచింది. జూన్ 12, 2025 న జరిగిన ఈ ప్రమాదంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించారు. ఈ విషయాన్ని అధికారికంగా హోం వ్యవహారాల సహాయమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు. ప్రమాదం అనంతరం పూర్తిగా కాలిపోయిన శవాలను గుర్తించేందుకు చేసిన డీఎన్‌ఏ పరీక్షలో విజయ్ రూపానీ మృతదేహం స్పష్టంగా గుర్తించారు. ఉదయం 11:10కు డీఎన్‌ఏ రిపోర్టు వచ్చింది.
విజయ్ రూపానీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన భౌతికకాయాన్ని అహ్మదాబాద్ నుంచి అంబులెన్స్ ద్వారా రాజ్‌కోట్‌లోని గ్రీన్‌ల్యాండ్ చౌక్డికి తరలించనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో నగరంలోని ముఖ్యమైన మార్గాల మీదుగా అంతిమయాత్రగా తీసుకెళ్లనున్నారు. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌కు కొన్ని నియంత్రణలు విధించబడ్డాయి. అయితే యాత్రకు, ప్రభుత్వ వాహనాలకు మాత్రం మినహాయింపు ఉంది.
రూపానీ అంత్యక్రియలు రామనాథ్‌పారా శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు వీలుగా వీధుల్లో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టారు. చివరి దర్శనం కోసం వేలాది మంది అభిమానులు, రాజకీయ నేతలు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంది.
పార్కింగ్ కోసం నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. వీటిలో VVIPలకు ఓంకార్ అపార్ట్‌మెంట్ ఎదురుగా, సాధారణ పౌరుల కోసం నిర్మల స్కూల్ ప్రాంగణం, సోజిత్రనగర్ వాటర్ ట్యాంక్ వెనుక భాగం, నిర్మల రోడ్ అగ్నిమాపక కేంద్రం ఎదురు భాగంలో ఏర్పాట్లు ఉన్నాయని ట్రాఫిక్ డీసీపీ పూజా యాదవ్ తెలిపారు.
రాష్ట్ర రాజకీయాల్లో దనదైన ముద్ర వేసిన విజయ్ రూపానీ లేకపోవడం తీరని లోటు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాష్ట్ర ప్రజలంతా ప్రార్థిస్తున్నారు.