జనసేన ముందున్న ఆప్షన్స్ ఇవే: పవన్ కళ్యాణ్ ఉవాచ.!

Pawan Kalyan

జనసేన పార్టీ ముందర మూడు ఆప్షన్స్ వున్నాయి. ఒకటి బీజేపీతో మాత్రమే కలిసి వెళ్ళడం. టీడీపీతో కలిసి పోటీ చేయడం.. మూడోది ఒంటరిగా పోటీ చేయడం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్నే జనసేన అధినేత తాజాగా వెల్లడించారు.. అదీ పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చేలా చెప్పారు.

‘గతంలో మేం తగ్గాం.. ఇప్పుడు మీరు తగ్గాలి..’ అంటూ నేరుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన సంకేతాలు పంపారు పొత్తుల విషయమై. ‘ఈసారి మేం తగ్గాలనుకోవడంలేదు..’ అని పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా, పొత్తులు అవసరమైతే టీడీపీనే తమ వద్దకు రావాలని తేల్చి చెప్పినట్లయ్యింది.

‘ముఖ్యమంత్రి అభ్యర్థి విషయమై బీజేపీ నాకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దాని గురించి ఆలోచించడం లేదు కూడా. జనసేన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. అది బీజేపీతో కలిసే అని ప్రస్తుతానికి అనుకుంటున్నాం..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

బెజవాడలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవని కొందరు రెండు కులాల మధ్య తగాదాగా మార్చారంటూ రంగా హత్య వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించిన జనసేనాని, కోనసీమలో అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య గొడవని రెండు సామాజిక వర్గాల మధ్య పంచాయితీ మార్చేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.

మొత్తమ్మీద, పవన్ కళ్యాణ్ మరోమారు ఏపీ రాజకీయాల్లో తనదైన స్టయిల్లో వేడి పుట్టించారన్నమాట.