ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కామ్ విలువ 2 వేల కోట్లా.?

చంద్రబాబు హయాంలో ఫైబర్ గ్రిడ్ స్కామ్ జరిగిందంటూ అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన విషయం విదితమే. అధికారంలోకి వచ్చాక ఆ స్కామ్ నిజాలు నిగ్గు తేల్చేందుకు సమాయత్తమైంది కూడా. వైఎస్ జగన్ ప్రభుత్వం, ఈ స్కామ్ విషయమై సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. చంద్రబాబు అనుకూలురైనవారికి అడ్డగోలుగా కాంట్రాక్టులు అప్పగించారన్నది ప్రధాన ఆరోపణ. ఫైబర్ గ్రిడ్ పేరుతో 2 వేల కోట్ల రూపాయల విలువైన స్కామ్ జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. కాగా, ఏపీ సీఐడీ ఈ కేసుకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేయడంతో, ఈ కేసు విచారణ ఎటు వెళుతుంది.? అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. అమరావతి స్కాం.. అంటూ వైఎస్ జగన్ సర్కార్ ఎంత యాగీ చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరోపిస్తే, అసలు ఆ అవకాశమే లేదని న్యాయస్థానం తేల్చేసింది. ప్రభుత్వం, తన వాదనల్ని న్యాయస్థానం ముందు సమర్థవంతంగా వినిపించలేకపోవడం వల్లే ఈ దుస్థితి అన్నది సర్వత్రా వినిపిస్తోన్న ఆరోపణ. వివిధ కేసుల్లో, టీడీపీ నేతల మీద కేసులు నమోదు చేయడం మీదున్న శ్రద్ధ.. ఆయా కేసుల్లో సరైన వాదనలు వినిపించడంలో ప్రభుత్వంగానీ, సీఐడీగానీ, పోలీసు శాఖకు సంబంధించిన వివిధ విభాగాలుగానీ పెట్టలేకపోతున్నాయనే విమర్శ ఒకటుంది. మరోపక్క, న్యాయస్థానాల్ని టీడీపీ మేనేజ్ చేస్తోందనే వైసీపీ విమర్శ గురించి ప్రత్యేకంగా చెప్పే పనేముంది.? ఇంతకీ, ఫైబర్ గ్రిడ్ స్కామ్ వ్యవహారం ఏమవుతుంది.? ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలా.. ఈఎస్ఐ మెడికల్ స్కాం తరహాలో.. ఇది కూడా ఓ టైమ్ పాస్ వ్యవహారమే అవుతుందా.? ఏమో మరి, కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఇది.