151 ఎమ్మెల్యేల్లో 10 మంది పోయినా ఏమవుతుందిలే అనేదే జగన్ లెక్కా ?

వైఎస్ జగన్ బలం ఆయన పార్టీ సాధించిన 151 ఎమ్మెల్యే సీట్లలోనే ఉంది.  ఆ సంఖ్యా బలం మూలంగానే అసెంబ్లీలో ఆయన, ఆయన మంత్రులు ఎన్ని మాట్లాడినా టీడీపీ కిక్కురుమనకుండా ఉండిపోవాల్సి వచ్చింది.  బహిరంగంగా మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా అంటూ హెచ్చరించినా ఏమీ అనలేని స్థితి టీడీపీది.  టీడీపీలోనే కాదు వైసీపీలో కూడా ఇదే సిట్యుయేషన్.  ఈ 151 మంది ఎమ్మెల్యేలు గెలవడానికి కారణం నేనే, నన్ను చూసే జనం ఓట్లు వేశారు అనే ధోరణిలో జగన్ ఉన్నారు. 
 
151 మందిలో కొందరిని జనం జగన్‌ను చూసే గెలిపించారనడంలో సందేహం లేదుకానీ పూర్తిగా అందరూ తన బొమ్మ పెట్టుకునే గెలిచారని జగన్ అనుకోవడం అపోహే అవుతుంది.  గెలుపులో ఎమ్మెల్యే అభర్థుల కృషి కూడా ఉంది.  ఎమ్మెల్యేలు అయ్యాక వారికీ కొన్ని ప్రత్యేక అధికారాలు, భాద్యతలు సంక్రమిస్తాయి.  వాటినైనా సీఎం గౌరవించాలి.  అసలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30 శాతం మందికి జగన్‌ను కలిసే అవకాశమే దొరకలేదనే టాక్ కూడా ఉంది.  
 
ఈ అసంతృప్తే ఎమ్మెల్యేల్లో ఒక్కసారిగా బయటపడింది.  వరుసగా ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్న వారిలో కొందరికి వేరే కారణాలు ఉన్నా సగం మంది సమస్య మాత్రం ఇదే.  సంవత్సరం గడిచినా ఇప్పటికీ తమకు తమ ముఖ్యమంత్రిని కలిసి ఎప్పటికప్పుడు సమస్యలు వినిపించే భాగ్యం దొరకలేదని ఫీలైపోతున్నారు.  ఇప్పటివరకు ఏ సీఎం కూడా ఇలా ఎమ్మెల్యేలను దూరం పెట్టిన దాఖలాలు లేవు.  గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ఎమ్మెల్యేలకు రోజువారీ షెడ్యూల్లో సమయం కేటాయించేవారు.  
 
కానీ జగన్ అలా చేయడం లేదు.  ఈ అలసత్వం వెనుక 151 నెంబర్ గట్టిగా పనిచేస్తోందని విశ్లేషకులు సైతం అనుకుంటున్నారు. ఏదో సాదాసీదా సంఖ్యా బలం అయితే జగన్ కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇచ్చేవారని, కానీ కావాల్సిన సంఖ్య కంటే ఎక్కువే ఉండటం, బయట టీడీపీ నుండి కూడా కొందరు ఎమ్మెల్యేలు అనుమతిస్తే పార్టీలోకి రావడానికి రెడీగా ఉండటంతో సొంత ఎమ్మెల్యేల్లో కొందరు అలిగి బయటకు వెళ్లినా ప్రభుత్వానికి ఢోకా ఏమీ ఉండదని సీఎంగారి భావన అని అనుకుంటున్నారు.  ఎంత బలమున్నా సొంత ఎమ్మెల్యేల పట్ల ఈ నిర్లక్ష్యం ఎప్పటికైనా కష్టాల్లోకి నెడుతుంది.