సూపర్ స్టార్ ప్రభావం వల్లనే ఆయన బ్యాక్ టు వైసీపీ అంటున్నారు 

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులే.  ఎన్ని ప్రభుత్వాలు మారినా కాంగ్రెస్ పార్టీ పట్ల కృష్ణగారి అభిమానం చెక్కు చెదరలేదు.  సినీరంగం నుండి ఎన్టీఆర్ పార్టీ పెట్టినా కూడా కృష్ణ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. సోదరుడు ఆదిశేషగిరిరావును కూడా కృష్ణ కాంగ్రెస్ పార్టీతోనే మమేకం చేశారు.  తాను రాజకీయాల నుండి బయటికి వచ్చినా సోదరుడికి మాత్రం అన్ని విధాలా సపోర్ట్ చేశారు.  శేషగిరిరావు కూడా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 
 
వైఎస్ మరణం తర్వాత వైఎస్ జగన్ వైకాపాను స్థాపించగా చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోగా ఆదిశేషగిరిరావు మాత్రం జగన్ వెంట నడిచారు.  వైఎస్ పట్ల ఎంత నమ్మకం చూపారో జగన్ పట్ల కూడా అంతే నమ్మకం చూపుతూ అన్ని విషయాల్లోనూ తన మద్దతును తెలిపారు.  కానీ 2019 ఎన్నికలకు ముందు ఆయన వైకాపాను వీడి సైకిల్ ఎక్కారు.  ఆ ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ టికెట్ ఆశించగా జగన్ నుండి అనుకూల స్పందన రాలేదని, అందుకే ఆయన పార్టీ మారారనే వార్తలొచ్చాయి.  వాటిలో నిజం ఎంతుందో తెలీదు కానీ ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడం వెనుక గల్లా జయదేవ్ ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంది. 
 
అయితే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, పార్టీలో అనుకూల వాతావరణం లేకపోవడంతో ఆయన అక్కడ ఉండలేకపోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.  ఈ నేపథ్యంలో ఆదిశేషగిరిరావు ఇటీవలే వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డిని కలవడంతో ఆయన తిరిగి వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం మొదలైంది.  ఈ వార్తలపై కనఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు కానీ ఆదిశేషగిరిరావు తిరిగి జగన్ గూటికి చేరడం వెనుక కృష్ణగారి ప్రభావం ఉందని, మొదటి నుండి తోడుగా ఉన్న వ్యక్తులతోనే కలిసి వెళితే బాగుంటుందని కృష్ణగారు ఇచ్చిన సలహా మేరకే ఆదిశేషగిరిరావు అడుగులు వేస్తున్నారని మాత్రం బలమైన వార్తలు వినిపిస్తున్నాయి.