వైసీపీ ఎంపీలందు ఈ ఎంపీ వేరయా 

 

వైసీపీ ఎంపీలందు ఈ ఎంపీ వేరయా 

 
వైసీపీ నేతలందరిలో కనిపించే కామన్ లక్షణం తమ నాయకుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి పట్ల అమితమైన స్వామి భక్తి.  అసలే జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని, పార్టీలోని అందరూ ఆయన్ను ఫాలో అవడమే తప్ప ఆయన ఎవరి మాటా వినరనే విమర్శలు ఉన్నాయి.  అందుకే తమ లీడర్ ఏం మాట్లాడినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ ఎదురు చెప్పకుండా తలలూపేస్తుంటారు.  కానీ ఒక్క ఎంపీ మాత్రం అలా కాదు.  మనసుకు అనిపించిందే చెప్తారు.  హద్దులు దాటి వినయం ప్రదర్శించడం, లీడర్ మెప్పు పొందాలని తహతహలాడటం ఆయనకు తెలీదు.  అయనే నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణ రాజు.  
 
మొదట వైసీపీలో ఉన్న అయన టికెట్ దొరక్క భాజాపాలో చేరారు.  ఆ పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయారు.  అనంతరం టీడీపీలో చేరారు.  గత ఎన్నికల్లో టీడీపీ నరసాపురం ఎంపీ టికెట్ ఆఫర్ చేసినా కాదని వైసీపీలో చేరి టికెట్ పొంది ఎంపీ అయ్యారు.  ఏ పార్టీలో ఉన్నా ఆయనది ముక్కుసూటి వ్యవహారమే.  అందువలనే పార్టీలను వీడినా ఆయన పరిచయాలు మాత్రం అలాగే ఉన్నాయి.  వైసీపీ ఎంపీ అయినప్పటికీ కేంద్రంలో బీజేపీతో ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి.  మోదీ, అమిత్ షాలకు ఏపీ నేతల్లో ఉన్న సన్నిహితుల్లో ఈయన కూడా ఒకరు. 
 
వైసీపీ నేతలంతా ఒక తీరున నడుచుకుంటే రఘురామ కృష్ణ రాజు దారి మాత్రం వేరే.  అధినేత ఏం చెప్తే దానికి తలూపే రకం కాదు.  ప్రతి విషయంలో ఆయనకంటూ సొంత అభిప్రాయలు, ఆచరణలు ఉంటాయి.  వాటినే ఫాలో అవుతారు.  అధినాయకత్వం చేసేది కరెక్ట్ అనిపిస్తే పూర్తి సహకారం అందిస్తారు, ఒకవేళ పొరపాటు అనిపిస్తే నేరుగా చెప్పేస్తారు.  తాజాగా టీటీడీ భూముల అమ్మకాల విషయంలో వైసీపీ నేతలందరూ అమ్మడంలో తప్పేముంది, అవి నిరర్థక ఆస్తులే కదా.  అయినా గత ప్రభుత్వాల హయాంలో ఆస్తుల విక్రయం జరగలేదా అంటూ మాట్లాడితే రఘురామ కృష్ణ రాజు మాత్రం ఒక భక్తుడిగా శ్రీవారి ఆస్తుల అమ్మకం సరైన నిర్ణయం కాదనేది నా వాదన అంటూ కుండబద్దలు కొట్టారు.  
 
తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎవరో పొరపాటు సలహాలు ఇచ్చారని, ఈ సమయంలో ఇలాంటి వివాదాల జోలికి వెళ్లడం సరైనది కాదని, దేవుడికి భక్తులు ఇచ్చిన కానుకలను అమ్మే హక్కు ఎవరికీ లేదని, అలా చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు.  ఇలా టీటీడీ విషయంలో తమ పార్టీ పాలసీని తప్పుబడుతూనే తన నాయకుడికి తాను ఎప్పుడూ సహకరిస్తానని చెప్పారు.  ఇక వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ తరపునే ఎంపీగా నిలబడతారా అంటే తమ పార్టీ ఈసారి కూడా టికెట్ ఇస్తుందనే నమ్మకం ఉందని, ఒకవేళ ఇవ్వకపోయినా ఎంపీగా పోటీ చేస్తానని మొహమాటం లేకుండా చెప్పేశారు.